Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడతెరిపిలేని ముసురుతో ... లోతట్టు ప్రాంతాలు జలమయం
- పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు
- పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
వారం రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షంతో భారీగా వరద నీరు చేరి ప్రజలు, రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. పంట పొలాలన్నీ మునిగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు చోట్ల వంతెనలు, రహదారులు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. ఇందులో అత్యధికంగా 6690 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. 68 గ్రామాల్లో వరి పొలాల్లోకి ఇసుకమేటలు వేయడం, పంటంతా మునగడంతో రైతాంగం నష్టపోయింది.
నవతెలంగాణ-విలేకరులు
ఇదేకాకుండా 28 గ్రామాల్లో 1010 ఎకరాల్లో సోయాపంటకు నష్టం వాటిల్లింది. 10 గ్రామాల్లో 200 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం కలిగింది.కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 50వేల ఎకరాల్లో వరి వేశారని, కొన్ని ప్రాంతాల్లో పత్తి, పెసరు నష్టపోయాయని అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. భారీ వర్షాల తర్వాత అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. సిరోంచ-కోటపల్లి మధ్య రహదారి కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్ వద్ద లోలెవల్ వంతెన కొట్టుకుపోవడంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. వేమనపల్లి మండలంలో మత్తడివాగు వంతెన కొట్టుకుపోయింది. జన్నారం మండలం దంపూర్, రోటిగూడ, చింతగూడ గ్రామాల్లోకి వరద నీరు రావడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ పర్యటించారు. వర్షంలోనూ క్షేత్రస్థాయిలో తిరిగి పంట పొలాలు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలను అంచనా వేస్తున్నారు. రోజువారీ పనులకు ఆటంకం కలగడంతో కూలీలు, పేదలకు పనులు లభించక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ సూచించడంతో కుటుంబ పోషణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 8 మి.మీల వర్షపాతం నమోదైంది. నారాయణపేటలో 5 మి.మీ, గద్వాలలో 5 మి.మీ, నాగర్‌కర్నూల్‌లో 6 మి.మీ, వనపర్తిలో 4 మి.మీ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని దివిటిపల్లి గ్రామంలో సావిత్రికి చెందిన ఇండ్లు పూర్తిగా నేలమట్టం కాగా లలిత, యాదయ్య, మణెమ్మ, అనంతరెడ్డి, శ్రీనివాసులు, రాజులకు చెందిన ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఇండ్లు కూలిన బాధితులకు పునరావాసం కల్పించాలని పలు పార్టీల నాయకులు కోరుతున్నారు. కూలిన ఇండ్లను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్ కాలనీలో శంకర్‌కు చెందిన ఇండ్లు పూర్తిగా కూలింది.
వాగు దాటి.. వైద్యం చేసి..
ఓ గ్రామంలో వైద్యం అందించడానికి డాక్టర్లు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పొంగుతున్న వాగులను దాటి చికిత్స అందించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం వెళ్తుండగా కాటి నాగారం, కోమట్ల గూడెం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా ఆర్బీఎస్కే డాక్టర్ మధు, డాక్టర్ మౌనిక సోమవారం వాగు దాటి వెళ్ళి గ్రామాల్లోని విద్యార్థులు, చిన్నారులు, ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పరిసరాలన్నీ బురదమయంగా మారాయని, ప్రజలు పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వారివెంట ఫార్మాసిస్ట్ బానోత్ సంజీవ్‌నాయక్, ఏఎన్ఎం రజిత తదితరులు ఉన్నారు.