Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరిగి టెండర్లు పిలుస్తాం
- హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మన ఊరు-మన బడి' కార్యక్రమం కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నీచర్ కొనుగోళ్లకు ఇచ్చిన టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మళ్లీ టెండర్లను పిలుస్తామంటూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో టెండర్లను సవాల్ చేస్తూ దాఖలైన రెండు రిట్లపై హైకోర్టు విచారణను ముగించింది. ఈ మేరకు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. గత విచారణలో రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియను కొనసాగించవచ్చుననీ, అయితే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే వరకు టెండర్లను ఖారారు చేయొద్దంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. మే 9న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిందనీ, వి 3 ఎంటర్ ప్రైజెస్ ప్రయివేట్ లిమిటెడ్, జెనిత్ మెటఫాస్ట్ ప్రయివేట్ లిమిటెడ్ హైకోర్టులో సవాలు చేశాయి. టేబుల్ డెస్క్, ఇతర ఫర్నీచర్ కొనుగోలుకు టెండర్ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలున్నా పిటిషనర్ల కంపెనీలను అనర్హత ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారని పిటిషనర్ల వాదన. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదన నిమిత్తం బుధవారం విచారణ జరిపింది. విచారణ ప్రారంభం అవ్వగానే ప్రభుత్వ ప్లీడర్ లేచి డ్యూయల్ డెస్క్‌లకు రూ.360 కోట్లు, ఫర్నీచర్‌కు రూ.195 కోట్లకు పిలిచిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ బోర్డుల సరఫరా టెండర్ విషయంలో రద్దు నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన చెప్పలేదు. గ్రీన్ బోర్డుల సరఫరా టెండర్‌ను సవాలు చేసిన రిట్ హైకోర్టులోని మరో న్యాయమూర్తి విచారణ జరపనున్నారు.
ఈడీ జప్తు చెల్లదు
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కోనేరు మధు ఇన్సూరెన్స్ డబ్బును ఈడీ జప్తు చేయడాన్ని హైకోర్టు రద్దు చేసింది. నిందితుడు కోనేరు రాజేంద్రప్రసాద్ కొడుకు మధుపై సీబీఐ, ఈడీ కేసులను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని విస్మరించి ఈడీ కేసు పెట్టి బీమా డబ్బును జప్తు చేయడం చెల్లదని తేల్చింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బెంచ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ నిర్ణయాన్ని మధు సవాల్ చేసిన రిట్‌ను ఆమోదించింది.
సీట్లను సర్ధుబాటు చేయండి
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం సిబ్బంది, ఇతర సౌకర్యాల్లేవని చెప్పి రాష్ట్రంలో మెడికల్ సీట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేసిన కేసులో హైకోరు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వసతుల్లేవంటూ టీఆర్ఆర్, ఎంఎన్ఆర్, మహవీర్ మెడికల్ కాలేజీల్లో 450 ఎంబీబీఎస్ సీట్లను, 100 పీజీ సీట్లను రద్దు చేసింది. తమకు ప్రత్యామ్నాయ సీట్లను కేటాయించలేదంటూ విద్యార్థులు, సీట్టు రద్దయ్యామని కాలేజీలు రిట్లను దాఖలు చేశాయి. సీట్ల రద్దు వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఖాళీగా ఉన్న ఇతర కాలేజీల్లో వారిని సర్ధుబాటు చేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది.