Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13వ తారీఖు వచ్చినా అందని జీతాలు
- 15 జిల్లాల్లో టీచర్లు, ఎంప్లాయీస్ ఎదురుచూపు
- ఇంటిఅద్దె, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక అవస్థ
- సకాలంలో ఈఎంఐ కట్టలేక వేలాది మందికి పెనాల్టీ
- విద్యవైద్యానికీ పైసల్లేక మనోవేదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 18 జిల్లాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకే ఇప్పటి వరకు జీతాలొచ్చాయి. అంటే ఇంకా 15 జిల్లాల్లో జీతాలు రాలేదు. 33 జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మేడ్చల్-మల్కాజిగిరి, హన్మకొండ, జనగామ, జయశంకర్-భూపాలపల్లి, నారాయణ్‌పేట, రాజన్న-సిరిసిల్ల, వనపర్తి, కొమురం భీం-ఆసిఫాబాద్, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలకు గతంలోనే జీతాలొచ్చాయి. సిద్ధిపేట, నిర్మల్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడేం జిల్లాల వారి ఖాతాల్లో మంగళవారం జీతాలు జమకావడం గమనార్హం. 13వ తారీఖు వచ్చినా ఇంకా 15 జిల్లాల్లో జూన్ జీతాల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదరుచూడాల్సి వచ్చింది. వారికి ఎప్పుడొస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు వస్తాయన్న ధీమా ఉండేది. సమాజంలోనూ వారిపై అందరికీ భరోసా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కో జిల్లాలో ఒక్కో తారీఖున జీతాలొస్తున్నాయి. అందులోనూ ఒకే జిల్లాలో కొన్ని శాఖల ఉద్యోగులకు తొలుత, మరికొన్ని శాఖల ఉద్యోగులకు తర్వాత సర్కారు సర్దుబాటు చేస్తున్నది. ఒకే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా ఒకే తారీఖున జీతాలు ఖాతాలో జమ కావడం లేదు. జిల్లాకో తారీఖున జమ అవుతున్నాయి. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. వారు కొత్త ఇంటి నిర్మాణం లేదంటే ఇంటిస్థలం, పిల్లల ఉన్నత చదువులు, కారు వంటి అవసరాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. అయితే ఎక్కువ మంది జీతాలు ఒకటో తేదీన వస్తాయనే నమ్మకంతో ప్రతినెలా పదో తేదీలోపు ఈఎంఐలు చెల్లిస్తామంటూ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇప్పుడు పరిస్థితి తారుమారు కావడంతో సకాలంలో ఈఎంఐలు చెల్లించని కారణంగా బ్యాంకులు వారికి పెనాల్టీలు వేస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బాధితులుగా మారుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
అప్పులతో నెట్టుకొస్తున్న ఉద్యోగులు...
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో డబ్బుల్లేకపోవడం వల్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇంటి నిర్వహణ భారంగా మారింది. ఇంటి ఖర్చులు, విద్యావైద్యానికీ డబ్బుల్లేక ఇబ్బంది పడే పరిస్థితి దాపురించింది. ఇంటిఅద్దె, పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చలేక మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జీతాలుంటాయి కాబట్టి ఇబ్బందులుండబోవంటూ చాలా మంది అభిప్రాయం. కానీ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా వారికి ఉండే ఇబ్బందులు వారికుంటాయి. జీతంలో సగానికిపైగా ఇల్లు, పిల్లల చదువులు, కారు వంటి బ్యాంకు రుణాల ఈఎంఐలకే పోతాయి. అందుకే సకాలంలో వారికి జీతాలు రాకపోవడంతో సతమతమవుతున్నారు. అవసరాల కోసం వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పులతో కుటుంబాలను నెట్టుకొచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మిగతా 15 జిల్లాల్లో వెంటనే జీతాలివ్వాలని కోరుతున్నాయి.
ఒకటో తారీఖున వేతనం పొందడం ఉద్యోగుల హక్కు - టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్రంలో ఇంకా 15 జిల్లాల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జూన్ నెల వేతనాలు, పెన్షన్లు, ఎయిడెడ్, మోడల్ స్కూల్ సిబ్బందికి వేతనాల బడ్జెట్ విడుదల చేయకపోవటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతినెలా ఒకటో తారీఖున గడిచిన నెల వేతనం పొందటం ఉద్యోగుల హక్కు అని తెలిపారు. గత రెండేండ్లుగా పదో తేదీ మధ్య రొటేషన్ పద్ధతిలో రోజూ కొన్ని జిల్లాల చొప్పున వేతనాలు జమయ్యేవని గుర్తు చేశారు. గత మూడు నెలలుగా పన్నెండు, పదిహేను తేదీల వరకు ఎప్పుడు జమవుతాయో తెలియని అయోమయం నెలకొందని తెలిపారు. ఈనెల మునుపెన్నడూ లేని విధంగా 15 జిల్లాలకు ఇంకా చెల్లింపులు జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తుందన్నట్టు ప్రతినెలా జరుగుతున్న ప్రచారం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని విమర్శించారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము అవసరాలకు తీసుకుందామనుకుంటే సకాలంలో అందటం లేదని పేర్కొన్నారు.
వేతనాలు, పింఛన్లు చెల్లించాలి : టీపీటీఎఫ్
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతనాలు, పింఛనర్లకు పింఛన్‌ను వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, అదనపు ప్రధాన కార్యదర్శి పి నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మంగళవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. రెండు రోజుల్లో ఉద్యోగులందరికీ జూన్ జీతాలు, పింఛనర్లకు పింఛన్లు చెల్లిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.