Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌడ సంఘాలు,
- సొసైటీలు సామాజిక బాధ్యతగా తీసుకోవాలి
- రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘాలు, సొసైటీలు సామాజిక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి, గిరక మొక్కలను విరివిగా నాటాలని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో అందుబాటులో ఉన్న రాష్ట్ర గౌడ సంఘాల నాయకులు, సొసైటీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ గీత వృత్తిని ప్రోత్సహిస్తున్నారన్నారు. అందులో భాగంగా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన సాంప్రదాయ ఔషధాలు ఆరోగ్య ప్రదాయిని అనీ, నీరా, కల్లును అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో సుమారు నాలుగు కోట్ల తాటి, ఈత, గిరక మొక్కలను నాటామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ప్రమాదవశాత్తు గీత కార్మికులు అంగ వైకల్యం పొందినా, అకాల మరణం చెందినా అలాంటి వారికి చెల్లించే ఎక్స్ గ్రేషియాను ఐదు లక్షలకు పెంచామన్నారు. వైన్ షాపులలో 15 శాతం రిజర్వేషన్లు గౌడ్లకు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. గౌడ సామాజిక తరగతికి కేటాయించిన ఐదెకరాల్లో రూ.5 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఆత్మగౌరవ భవన శంకుస్థాపన పైనా ఈ సమావేశంలో చర్చించారు. శ్రావణమాసంలో నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎంవీ. రమణ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్, తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మెన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, గౌడ సంఘం నాయకులు కూన వెంకటేష్ గౌడ్, రాష్ట్ర గౌడ కల్లు గీత వృత్తిదారుల సంఘం అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్, అఖిల భారత గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూరేళ్ల వేములయ్య గౌడ్, తెలంగాణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, గౌడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టే విజరు కుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, సొసైటీ ప్రతినిధులు ఆంజనేయులు గౌడ్, దాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కొత్త నవీన్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.