Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్గదర్శకాలకు విరుద్ధంగా పనులు జరిగినట్టు నిర్ధారణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులు మార్గదర్శకాలకు విరుద్ధంగా, అవకతవకలతో చేపట్టినట్టు గుర్తించినట్టు, అమలు తీరును మరింత లోతుగా పరిశీలించేందుకు మళ్లీ బృందాలను పంపనున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 15 జిల్లాల్లో కేంద్ర బృందాలు త్వరలో పర్యటించనున్నాయి. ఆ జాబితాలో నిజామాబాద్, పెద్దపల్లి, మెదక్, సిద్ధిపేట, సూర్యాపేట, కరీంనగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో డైరెక్టర్/డిప్యూటీ కార్యదర్శి హౌదా కలిగిన అధికారి అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ బృందంలో ఒక ఇంజినీరుతో సహా ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. ఒక్కో జిల్లాలోని రెండు బ్లాకుల్లోని నాలుగు నుంచి ఆరు గ్రామ పంచాయతీలలో ఈ బృందాలు పర్యటించనున్నాయి. చెరువుల పూడికతీత, కందకాల నిర్మాణం, రోడ్ల వెంబడి మొక్కలు నాటడం లాంటి పనులను పరిశీలించనున్నాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పారదర్శకత, జవాబుదారీతనం అంశాలపై దృష్టి సారించనున్నాయి. క్షేత్ర స్థాయిలో పథకం సక్రమంగా లక్ష్యాల మేరకు అమలు జరిగేలా చూసి, లోటుపాట్లను సవరించి మార్గదర్శకాల మేరకు పథకం పారదర్శకంగా అమలు జరిగేలా చూసేందుకు ఈ పర్యటనలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర బృందం జూన్ తొమ్మిది నుంచి 12 వరకు రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో అనుమతి లేని పనులు చేపట్టడం (ఆహార ధాన్యం ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్ నిర్మాణం), చిన్న తరహా నీటి చెరువుల్లో పూడిక తీయడం, మైదాన ప్రాంతాల్లో కందకాలు చేపట్టడం వంటి పనులను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టినట్టు కేంద్ర బృందం పర్యటనలో వెల్లడైంది. కొండ ప్రాంతా లకు మాత్రమే అనువైన కందకాల తవ్వకాలను విభజించి మైదాన ప్రాంతాల్లో అమలు చేసినట్టు కేంద్ర బృందం గుర్తించింది. ఉన్నత స్థాయిలో సాంకేతిక అనుమతులు పొందకుండా మార్గదర్శకాలు ఉల్లంఘించి పనులు చేపట్టేందుకు వీటిని విభజించి నిర్మించారని కేంద్ర బృందం పరిశీలనలో తేలినట్టు సమాచారం.