Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార పంటలకు రూ.20వేలు.. వాణిజ్య పంటలకు రూ.40 వేలు ఇవ్వాలి
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వారం నుంచి కురుస్తున్న వర్షాలతో 12 లక్షల ఎకరాలు దెబ్బతిన్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదిక రూపొందించిందనీ, ఆ రైతులకు వెంటనే పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆహార ధాన్యాల పంటలకు ఎకరానికి రూ.20 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.40 వేలు పరిహారం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత వానాకాలంలో ఇప్పటిదాకా 54 లక్షల ఎకరాల్లో పంట సాగైందనీ, అందులో 12 లక్షల ఎకరాల పంటలు అధిక వర్షాలతో దెబ్బతిన్నాయని తెలిపారు. దెబ్బతిన్న పంటలలో ఏడు లక్షల ఎకరాల పత్తి మొలక దశలోనే నాలుగు రోజులు నీటిలో ఉండి చనిపోయిందని పేర్కొన్నారు. ఎకరాకు రైతులు రూ.8 వేలు పెట్టుబడి పెట్టి పంటలేశారని వివరించారు. తిరిగి పంటలు వేయాలంటే విత్తనాలు, ఎరువులు, యంత్రాలు అద్దెకు కావాలనీ, మళ్లీ రైతులు ఆ పెట్టుబడిని భరించే స్థితిలో లేరని తెలిపారు. జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి కేంద్ర బృందాలని రప్పించాలని కోరారు.
కేంద్రం నుంచి పరిహారం కింద అదనపు నిధులు రాబట్టాలని సూచించారు. ప్రకతి వైఫరీత్యాలకు సంబంధించి 2015-16 మినహా ఏనాడు పరిహారం రైతులకు ఇవ్వలేదని గుర్తుచేశారు. గతేడాది కేంద్ర మంత్రులు వరంగల్ వెళ్ళి వరదల నష్టాన్ని చూసి వచ్చికూడా ఎలాంటి పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. 15వ ఫైనాన్స్ కమిషన్ తెలంగాణకు 2021-22కు రూ.449 కోట్లు, 2022-23 రూ.473 కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. ఐదేండ్లకు( 2021 నుంచి 2025 వరకు) రూ.2,485 కోట్లు మాత్రమే కేటాయించిందని పేర్కొన్నారు. ఈ వానాకాలం పంటలకు జరిగిన నష్టమే రూ.2,000 కోట్లకుపైగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఒత్తిడి పెంచి రైతులకు పరిహారం ఇప్పించాలని కోరారు. 2020-21లో 12.5 లక్షల ఎకరాల్లో, 2021-22లో 8.6 లక్షల ఎకరాలు నష్టం వాటిల్లి రైతులు నష్టపోయారని తెలిపారు. తిరిగి ఈ సంవత్సరం పంటవేసిన పక్షం రోజులకే 12 లక్షల ఎకరాల్లో దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి నీళ్లు వచ్చిన చోట ప్రజలకు పునరావాసం కల్పించి ఆహారం, తాగునీరు అందించాలనీ, అంటురోగాలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.