Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టెట్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయంటూ ఆందోళన చెందుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు https://tstet.cgg.gov.in వెబ్సైట్లో టెట్ ఓఎంఆర్ షీట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. టెట్ ఫలితాలు, కీలో వచ్చిన మార్కులకు తేడా ఉందంటూ అభ్యర్థులు భావిస్తున్న నేపథ్యంలో ఓఎంఆర్ షీట్లను అందుబాటులోకి తేవడం గమనార్హం. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. టెట్ పేపర్లకు సంబంధించి గతనెల 29న ఫైనల్ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల ఒకటిన ఫలితాలను ప్రకటించింది. అయితే, ఫైనల్ కీలో వచ్చిన మార్కులకు... ప్రకటించిన ఫలితాల్లో వచ్చిన మార్కులకు చాలా తేడాలున్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. టెట్ ఓఎంఆర్ షీట్ కోసం రూ.15 రుసుం చెల్లించాల్సి ఉంటుందని టెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. టెట్ పేపర్-1కు 3,51,476 మంది దరఖాస్తు చేయగా 3,18,444 మంది పరీక్ష రాశారు. వారిలో 1,04,078 (32.68 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2కు 2,77,893 మంది దరఖాస్తు చేస్తే, 2,50,897 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,24,535 (49.64 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు.