Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులకు ఏటా ప్రదానం చేసే పురస్కారాలకోసం ప్రముఖ సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ' అర్పిత ' దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సంస్థ కన్వీనర్ జి.భవాని గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్య, వైద్యం, విధి నిర్వహణ, సామాజిక సేవ, నృత్యం, క్రీడలు, కళలు, సాహిత్యం, చిత్రలేఖనం, శాస్త్రీయ సంగీతం (నాదస్వరం, డోలు, సాక్సోఫోన్, గాత్రం) ఆధ్యాత్మికం, ఉపాధి కల్పన తదితర రంగాల్లో ప్రతిభగల వ్యక్తులు, చిన్నారులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి 'ఆంధ్ర రత్న' 'తెలంగాణ రత్న' అవార్డులతో పాటు, పది మంది అత్యుత్తమ ఉపాధ్యాయులకు 'డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్' ఇతర రంగాల్లో సేవలందించిన పదిమందికి 'నేషనల్ బెస్ట్ సిటిజన్' , 'లైఫ్ టైం అచీవ్ మెంట్' అవార్డులను అందజేయనున్నామని తెలిపారు. అంతేకాకుండా అభ్యర్థుల కేటగిరీల వారీగా 'కళాబంధు', ఎన్టీఆర్ స్మారక 'కళా విభూషణ్' డాక్టర్ సీ.నా.రే స్మారక 'సాహిత్య కళానిధి' ప్రముఖ నృత్య కళాకారులకు 'సిద్ధేంద్రయోగి నాట్య కళా విశారద' జాతీయ అవార్డులతో పాటు ఏదైనా మూడు రంగాల్లో విశేష ప్రతిభ గల ఇద్దరికి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన '' భారత ప్రతిభా రత్న '' ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందజేయనున్నామని వివరించారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను 7780589775 వాట్సాప్ నెంబర్కు ఈనెల 25వ తేదీ లోగా పంపించాలని కోరారు. ఎంపికైన వారికి ఆగస్టు 22న హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులను ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9391379903 నెంబర్ను సంప్రదించాలని కోరారు.