Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుద్ఘాతంతో ఇద్దరు యువకులు మృతి
- మరో ఇద్దరికి గాయాలు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ముసురు వర్షం ఇద్దరు కార్మికుల ఉసురు పోసుకుంది. వీధిలైట్ల ఏర్పాటు కోసం స్తంభాలను పాతుతుండగా.. పైన ఉన్న వైర్లు తగిలి విద్యుద్ఘాతానికి గురై మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో జరిగింది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం ఎస్ లింగోటం గ్రామంలోని మిషన్ భగీరథ పథకం పంప్‌హౌస్ పనులను రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తోంది. ఇందులో ఆపరేటర్‌గా తల్లోజు అరుణ్ చారి(22), కాంట్రాక్టు కార్మికులుగా వల్లపు ప్రశాంత్(18), తల్లోజు వంశీ, జటగోని లింగయ్య పని చేస్తున్నారు. గురువారం నారాయణపురం మండలం మర్రిబాయి తండాలో మిషన్ భగీరథ సంపు వద్ద స్ట్రీట్ లైట్ల ఏర్పాటు కోసం సంపు ఇన్చార్జి కిరణ్‌తో కలిసి స్తంభాలను నాటుతున్నారు. నాలుగో స్తంభం నాటుతుండగా పక్కనే గల 11 కెవి కనెక్షన్ విద్యుత్తు వైర్‌కు తగలడంతో విద్యుత్ షాక్ వచ్చింది. దాంతో తల్లోజు అరుణ్ చారి(21), వల్లపు ప్రశాంత్(18) అక్కడికక్కడే మృతిచెందారు. వంశీ, లింగయ్య గాయపడ్డారు. సంఘటనా స్థలంలో కాంట్రాక్టర్, ఇంజినీర్ ఎవరూ లేరు. గాయపడిన వారే తోటి కార్మికుల మృతదేహౄలను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఎస్ లింగోటం సర్పంచ్ పాండు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. తగిన నష్టపరిహారం అందజేసి ఆదుకుంటామని రాఘవ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఘటనా స్థలాన్ని చౌటుప్పల్ రూరల్ సీఐ వెంకటయ్య, నారాయణపురం ఎస్ఐ యుగంధర్ పరిశీలించారు.