Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్యం మత్తులో ఇద్దరు ఆర్మీ జవాన్ల వీరంగం
నవతెలంగాణ-కాగజ్‌నగర్
దేశరక్షణ కోసం ప్రాణాలకొడ్డి పోరాడాల్సిన ఇద్దరు ఆర్మీ జవాన్లు మద్యం మత్తులో రైలులో వీరంగం సృష్టించారు. ఈ ఘటన గురువారం సాయంత్రం కుమురంభీం- ఆసిఫాబాద్ జిల్లాలో దురంతో ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. దీనికి సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇద్దరు జవాన్లు బల్జీత్‌సింగ్, విశాల్ సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సికింద్రాబాద్‌లో దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు (నెం.12285) ఎక్కారు. రైలులోని బి-4 ఏసీ కంపార్ట్మెంట్లో వీరు ప్రయాణిస్తున్నారు. విపరీతంగా మద్యం సేవించి ఉన్న వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. రైలు మంచిర్యాల-బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో ఉండగా, బల్జీత్‌సింగ్ సర్వీసు రివాల్వర్‌ను విశాల్ తీసుకున్నాడు. విశాల్ ఆ రివాల్వర్‌తో కిందికి చూపిస్తూ పేల్చాడంతో భారీ శబ్దం వచ్చింది. దీనితో కంపార్ట్మెంట్లోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటికే వీరిద్దరి ప్రవర్తనను గమనిస్తున్న ప్రయాణీకులు టీసీ రాజశేఖర్‌కు సమాచారం ఇచ్చారు. రివాల్వర్ పేల్చే దృశ్యాన్ని ప్రయాణీకులు వీడియో తీశారు. టీసీ రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు రైలును కాగజ్‌నగర్‌లో ఆపి వీరిద్దరిని దింపేశారు. అప్పటికీ మద్యం మత్తు వీడని వీరిద్దరూ రైలు నుంచి దిగేందుకు కూడా ససేమిరా అంగీకరించకపోవడంతో రైల్వే పోలీసులు బలవంతంగా రైల్వే పోలీసుస్టేషన్‌కు తరలించారు. రివాల్వర్‌ను, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఇద్దరినీ మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.