Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటీస్‌బోర్డుల్లో పేర్లు పెట్టాలని ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
'అబ్బే...అలాంటిదేం లేదు...' అని నిన్నమొన్నటి వరకు చెప్పుకొచ్చిన ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు సంస్థలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)కు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే డిపోల వారీగా వీఆర్ఎస్కు ఆసక్తి ఉన్న ఉద్యోగుల వివరాలను సేకరించిన యాజమాన్యం తాజాగా ఆ జాబితాలకు ఆమోదం తెలుపుతూ రెండ్రోజుల్లో రీజినల్ మేనేజర్ (ఆర్ఎమ్) కార్యాలయాలకు పంపాలంటూ డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఆయా జాబితాలను ఆర్ఎమ్ కార్యాలయాల్లోని నోటీసుబోర్డుల్లో ప్రదర్శించాలని కూడా బస్‌భవన్ నుంచి క్రింది స్థాయి అధికారులకు మెసేజ్‌ల రూపంలో ఆదేశాలు జారీ అయ్యాయి. డిపోల్లో అనధికారికంగా వీఆర్ఎస్ దరఖాస్తులపై సంతకాలు చేయిస్తున్నారంటూ కార్మిక సంఘాలు ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేపట్టాయి. దీనిపై మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కూడా స్పందించారు. దాదాపు రెండువేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీఆర్ఎస్కు సంబంధించి ఎక్కడా అధికారిక ఉత్తర్వులు ఇవ్వకుండా దరఖాస్తుల్ని స్వీకరించడంపైనే కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీఆర్ఎస్ తీసుకుంటే ఉద్యోగులకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలను వెల్లడించాలనీ డిమాండ్ చేశాయి. అయితే అవేవీ ప్రకటించకుండా దరఖాస్తుల్ని స్వీకరించి, ఇప్పుడు వాటికి ఆమోదం తెలుపమని ఆదేశాలు ఇవ్వడం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది.