Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటితో ముగుస్తున్న కేంద్రం గడువు
- వేచిచూసే ధోరణిలో తెలుగు రాష్ట్రాలు
- పునర్విభజన చట్టాన్ని అమలుచేయాల్సిందే:సాగునీటి నిపుణులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించాలని కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అమలుపై రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన ఉత్తర్వులు న్యాయబద్దంగా లేవంటూ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతుండగా, తెలంగాణ ఇస్తేనే తాము ఇస్తామంటూ ఏపీ సర్కారు మెలిక పెట్టింది. దీంతో రెండుసార్లు గతంలో గడువు పెంచినా ఫలితం లేకుండాపోయింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దేశాలను బేఖాతర్ చేశాయి. కాగా రాష్ట్రానికి చెందిన ఇటు సాగునీటిశాఖ ఉన్నతాధికారులు, అటు సాగునీటిరంగ నిపుణులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సరికాదని చెబుతున్నారు. పునర్విభజన చట్టాన్ని అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనీ, తాను చేయాల్సినవి చేయకుండా, రాష్ట్రాలపై పెత్తనం చేస్తూ అధికారాలు, హక్కులను హరిస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన నికర జలాల పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గోదావరి జలాలకు సంబంధించి పెద్దగా సమస్యలేవీ లేవు. కానీ కృష్ణా నదీ జలాలను ఇరు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. దీనికి అటు ఏపీ అంగీకరించడం లేదు. పునర్విభజన చట్టమే ప్రాతిపదికగా తీసుకోవాలని ఆ ప్రభుత్వం అంటున్నది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ ఎటూ తేల్చకుండా రెండు రాష్ట్రాల మధ్య తగవు పెట్టేందుకుగాను విచిత్రమైన ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ను నియమించాలి. గతంలో ఉన్న రెండు ట్రిబ్యునళ్లు సైతం ఈ జలాల పంపిణీ సమస్యను తేల్చలేకపోయాయి. వాటి తీర్పుల మూలంగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని ఇటు అధికారులు, అటు సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. ఆ నేపథ్యంలో మళ్లీ మూడో ట్రిబ్యునల్ వేసాక, దాని తీర్పు ప్రకారం ప్రాజెక్టులను అప్పగించే విషయాన్ని ఆలోచిస్తామని తెలంగాణ చెబుతున్నది. దీనిపై ఎటూ తేల్చకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగిస్తేనే, మేమూ బోర్డుకు ప్రాజెక్టులను బదిలీ చేస్తామని ఏపీ సర్కార తిరకాసు పెట్టింది. వీరి అభిప్రాయాలను పరిశీలించిన కేంద్ర జలశక్తిశాఖ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నింటిని బోర్డులకు అప్పగించాలని గత ఏడాది రెండుసార్లు గడువు విధించింది. ఈ సంవత్సరం జులై 15వ తేదీని తుది గడువుగా పేర్కొంది. మొత్తం ఇప్పటివరకు మూడుసార్లు ప్రాజెక్టుల అప్పగింత కోసం గడవు పెంచుతూ వచ్చింది. దీనిపై తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి కదలికా లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గడువు పెంచాలని లేఖలు రాయడం గానీ, ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పడం గానీ చేయలేదు. దీంతో ఏపీ సర్కారు సైతం చడీచప్పుడు లేకుండా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో కృష్ణా నదీపై 36 భారీ ప్రాజెక్టులు, గోదావరిపై 71 చిన్న,మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 107 సాగునీటి ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్టులకు అప్పగించాల్సి ఉంది. ట్రిబ్యునల్ వేసి నికర జలాల పంపిణీ సంగతి తెల్చకుండా తాము ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించబోమంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెబుతూ గతంలోనే కేంద్ర జలశక్తిశాఖకు లేఖలు రాసింది. ఆయా బోర్డుల సమావేశాల్లోనూ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయినా సమస్యల పరిష్కారం వైపు ఆలోచించకుండా కేంద్రం, ప్రాజెక్టుల అప్పగింత ఉత్తర్వులు అమలుచేయాలంటూ గడువునూ పెంచుతూ వస్తోంది. మూడో ట్రిబ్యునల్‌ను వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని కేంద్రం పక్కనబెట్టింది. అంతేకాకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఏడాదికి రూ. 200 కోట్ల చొప్పున నిధులు జమచేయాలని ఆదేశించింది. ఈ అంశాలపై రాష్ట్ర సర్కారు కూడా పట్టుదలగా ఉంది. దీనిపై తెలంగాణ సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను వివరణ కోరగా ' కేంద్ర జలశక్తి శాఖ పెట్టిన గడువు విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని' చెప్పారు. ఈ విషయమై సాగునీటి రంగ నిపుణులు సారంపల్లి మల్లారెడ్డిని సంప్రదించగా 'కేంద్రం పునర్విభజన చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ హక్కులు, అధికారాలను కాలరాస్తున్నదని' అన్నారు. పునర్విభజన చట్టం సెక్షన్ 3 ని అమలుచేయకు ండా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. బోర్డులు నిర్వహించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు సైతం ప్రాజెక్టుల విషయమై గట్టిచర్యలు తీసుకోవాలని కోరారు.