Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుబంధు, ధాన్యం డబ్బులను పాతబకాయిల కింద జమచేయొద్దు
- నాబార్డు ఎదుట నిరసనలో రైతు సంఘం నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు బ్యాంకులు రుణాలివ్వాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేయాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకులు ప్రతి ఏటా 18 శాతం రుణాలు వ్యవసాయ రంగానికి, రైతులకు ఇవ్వాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. ఈ ఏడాది రూ.53 వేల కోట్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా.. బ్యాంకులు నేటి వరకు కూడా పది వేల కోట్ల రూపాయలకు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకూ రుణాలివ్వకపోవడం బాధాకరమన్నారు. రైతులు బాకీ ఉన్నారు కాబట్టి రుణాలు ఇవ్వడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారని తెలిపారు. ఇప్పటిదాకా రూ.25 వేల లోపు మాత్రమే రుణాలు మాఫీ అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన రుణాలను బ్యాంకులకు చెల్లించకపోవడం వల్ల రైతులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో రైతుల నుంచి ఎలాంటి పాత బకాయిలు వసూలు చేయొద్దనే నిబంధన ఉన్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదని చెప్పారు. రైతులకు పెట్టుబడి కోసం రుణాలివ్వాల్సిన సమయంలో వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. క్షేత్రస్థాయిలో చాలా వరకు బుక్ అడ్జెస్ట్మెంట్ చేసి రుణాలిచ్చినట్టు చూపెడుతున్నారని తెలిపారు. రైతు బంధు, ధాన్యం డబ్బులను బ్యాంకులు రైతుల పాత బకాయిల కింద ముదరబెట్టొద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వరదలతో రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనీ, అందులో పత్తి పంటనే ఏడు లక్షల ఎకరాలకుపైగా ఉందని తేలిందన్నారు. మళ్లీ రైతులు విత్తనాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలిప్పించాలని డిమాండ్ చేశారు. పోడు రైతులకు కనీసం హక్కు పత్రాలివ్వలేదని తెలిపారు. పోడు, కౌలు రైతులకు కూడా పంట రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, మూఢ్శోభన్, వెంకట్, విజరు, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.