Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 ఏండ్లలో రూ.9,456 కోట్లు వృధా
- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శ్రద్ధ లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. ఆ రంగానికి ఎనిమిదేండ్ల కాలంలో రూ.9,456 కోట్లు వృధా అయ్యాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆర్టీఐ ద్వారా లెక్కలు తీస్తే రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణలో గత ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సుమారు 9,456 కోట్లు విద్యాశాఖలో ఖర్చు చేయకుండా మురిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో రాష్ట్ర వాటా 40 శాతం, కేంద్రం వాటా 60 శాతం ఉంటాయని వివరించారు. పేద పిల్లల విద్య మీద కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత ఇదీ అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం ఆమోదించిన నిధులు వృధా అయ్యాయని తెలిపారు. సమగ్ర శిక్ష పథకానికి సంబంధించి 2017-18 నుంచి 2021-22 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) రూ.11,541.32 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదించిందని వివరించారు. ఇందులో కేంద్రం రూ.3,141.46 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2,141.76 కోట్లు కలిపి మొత్తం రూ.5,462.96 కోట్లు ఖర్చు చేశాయని పేర్కొన్నారు. పీఏబీకి విరుద్ధంగా రూ.236.55 కోట్లు ఖర్చయిందని తెలిపారు. పీఏబీ ఆమోదించినా రూ.6,078.36 కోట్లు ఖర్చ కాలేదని వివరించారు. ఆయన ట్విట్టర్లో పొందుపర్చిన ఈ వివరాలు చర్చనీయాంశంగా మారాయి.