Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలప్రాణాలు కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. గోదావరి ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం సీఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయడంతో పాటు గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో భద్రాచలం వద్ద శుక్రవారం నాటికి నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టాన్ని అరికట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను అభినందించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలనీ, ప్రజలకు సహాయ, పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు తదితర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్టు సమావేశంలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.