Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు నిధులిచ్చి సహాయ చర్యలు చేపట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల వల్ల 11 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. అందులో ఏడు లక్షల ఎకరాల్లో మొలకలు ఎత్తిన పత్తి మునిగిపోయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించిందని పేర్కొంది. రానున్న మూడు రోజుల్లో వర్షాలు పెరిగి మరింత నష్టం జరిగే అవకాశమున్న నేపథ్యంలో వరదనష్టాన్ని అంచనా వేయాలనీ, వివరాలను సేకరించాలనీ, నష్టపోయినవారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. విత్తనాలు, పెట్టుబడి అందించాలని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వరదల వల్ల పంటలే గాక గ్రామపంచాయితీల ఆస్తులు, రహదార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఇండ్లు కూలి ఎనిమిది మంది చనిపోయారని తెలిపారు. అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వరదనీరు వచ్చి వంటసామాన్లు, బట్టలు, వస్తువులు, సరుకులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ప్రాంతాల్లో ఎక్కువ నష్టం వాటిల్లిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగడానికి మంచినీరు సైతం దొరకడం లేదని వివరించారు. ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి 11 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. తిరిగి పంట వేయడానికి పెట్టుబడులు, విత్తనాలు అవసరముందనీ, అందుకనుగుణంగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత వరద పరిస్థితిని స్పష్టంగా అంచనా వేసి ఈ నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందించి కేంద్రానికి పంపించాలని కోరారు. కేంద్ర బృందాలతో పరిశీలన చేయించి, పరిహారం రాబట్టాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు నిధులు కేటాయించి సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రహదార్లు, పాఠశాలల మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని కోరారు. ఆరోగ్యం దెబ్బతిన్నవారికి వైద్యసౌకర్యం కల్పించాలనీ, అంటురోగాలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.