Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో శుక్రవారం నుంచి 18 ఏళ్లు పైబడి, రెండో డోసు వేసుకుని ఆర్నెల్లు పూర్తయిన వారికి ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 75 రోజుల పాటు జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారందరికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 60 ఏండ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించిన కేంద్రం.. ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి.. 18 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేవలం ప్రయివేటు ఆస్పత్రులకు అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా బూస్టర్ డోస్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. మరోవైపు కొత్త వేరియంట్ రూపంలో కరోనా కేసులు పలు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రెండు డోసులు పూర్తి చేసుకున్న అర్హులకు ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర సర్కారు కేంద్రాన్ని కోరింది. ఈ విషయమై కేంద్రానికి మంత్రి హరీశ్ రావు గతేడాది డిసెంబర్ 2, ఈ ఏడాది జనవరి 18, ఏప్రిల్ 11న మొత్తం మూడు సార్లు లేఖ రాశారు. జూన్ 13న అన్ని రాష్ట్రాల అరోగ్య శాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుక్ మాండవీయకు హరీశ్ మరోమారు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. ''ప్రపంచ కొవిడ్ పరిస్థితులు, ఇతర రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బూస్టర్ ఇచ్చేందుకు అనుమతించాలనీ, తద్వారా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవుతుందని కేంద్రానికి వివరించాం. పలుమార్లు విజ్ఞప్తి చేశాం. ఆలస్యం జరిగినప్పటికీ, ఇప్పటికైనా అనుమతించడం సంతోషకరం. ఈ నిర్ణయం, రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ దేశానికి మేలు చేస్తుంది. రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ కలిపి మొత్తం 20 లక్షల డోసుల నిల్వ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ అందించేలా ఏర్పాట్లు చేయలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది.'' అని ఈ సందర్భంగా హరీశ్ రావు పేర్కొన్నారు.