Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలదిగ్బంధనంలో భద్రాద్రి
- ఏజెన్సీని చుట్టుముట్టిన వరద నీరు
- తీవ్ర ఆందోళనలో స్థానికులు
- సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం
- అందుబాటులో హెలికాప్టర్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ఏజెన్సీపై గోదావరి కన్నెర్ర చేసింది. వారం రోజులుగా తన ప్రతాపాన్ని చాటుతోంది. నిన్నమొన్నటి వరకు 60 అడుగులు దాటిన గోదావరి.. శుక్రవారం భద్రాచలం వద్ద 70 అడుగులకుపైగా చేరింది. దీంతో భద్రాచలం నియోజకవర్గంలోని పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు 65.90 అడుగులు ఉన్న గోదావరి.. అనంతరం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. 9 గంటలకు 67.90, మధ్యాహ్నం రెండు గంటలకు 69.60 అడుగులకు చేరుకుంది. సాయంత్రం నాలుగు గంటలకు గోదావరి 70 అడుగులు దాటడంతో ఏజెన్సీలో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. ఐదు గంటలకు 70.30 అడుగుల వద్ద ప్రవహిస్తోంది.
1976 నుంచి భద్రాచలం గోదావరి వరద లెక్కలను పరిశీలిస్తే.. 1986లో 75.6 అడుగులు, 1990లో 70.8 అడుగులు గోదావరి నీటిమట్టం నమోదయింది. ఈ ఏడాది జులై రెండో వారంలోనే 70 అడుగులు దాటి రికార్డు నమోదైంది. ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద ప్రవాహం కావడం గమనార్హం. ఒక్కసారిగా 70 అడుగులకు పైగా గోదావరి ప్రవహించడంతో భద్రాచలం, బూర్గంపాడు, పినపాక, మణుగూరు, కరకగూడెం, దుమ్మగూడెం, చర్ల తదితర మండలాల్లోని గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుకుంది. వరద ముంపు పెరిగిన నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు పదివేల మందికి పైగా వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. భద్రాచలం పుణ్యక్షేత్రం సైతం ముంపులో చిక్కుకుంది. పట్టణంలోని కరకట్ట సర్వీసులు పలుచోట్ల లీకు కావటంతో నీరు సమీపకాలనీ ఇండ్లను చుట్టుముట్టింది. రామాలయం చుట్టూ వరద చేరింది. కళ్యాణ కట్ట, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, ఇతర చిన్న ఆలయాలు, శ్మశాన వాటిక పూర్తిగా జలమయమయ్యాయి. భద్రాచలం పట్టణానికి ఎటపాక సమీపంలో, కూనవరం రోడ్డు సమీపంలో ప్రధాన రహదారిపైకి నీరు చేరుకోవడంతో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలకు వీలు లేకుండా పోయింది. పట్టణ బ్రిడ్జిపై రెండో రోజు కూడా రాకపోకలు నిలిపివేశారు. నాలుగు రోజులుగా భద్రాచలం ఏజెన్సీ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాచలం, బూర్గంపాడు తదితర మండలాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ భద్రాచలంలోనే ఉండి వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీపు అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎస్పీ డాక్టర్ వినీత్ భారీ పోలీసు బలగాలు మోహరింపు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. గోదావరి సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం తన సేవలను అందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వరద బాధితులకు సహాయం చేయడానికి హెలికాప్టర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. నలుగురు స్పెషల్ డిప్యూటీ డైరెక్టర్లను శుక్రవారం ప్రభుత్వం భద్రాచలం ఏజెన్సీకి తరలించింది.