Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియంత్రణ కోసం చట్టం తేవాల్సిందే...
- ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను అరికట్టాలి
- ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
- మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించాలి
- సర్కారుపై ఒత్తిడికి విశాల వేదిక ఏర్పాటు
- టీయూడీఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా రాష్ట్ర సదస్సులో వక్తలు
- ప్రయివేటు విద్యాసంస్థలు అవసరం లేదు : ఆకునూరి మురళి
- ప్రయివేటు విద్యతోనే అసమానతలు : శాంతాసిన్హా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీపై యుద్ధం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను అరికట్టాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలనీ, సర్కారు బడులను బలోపేతం చేయాలనీ, వాటిలో మౌలిక వసతులను మెరుగుపర్చాలనీ, నాణ్యమైన బోధన అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, సర్కారు బడుల బలోపేతానికి విశాల ప్రాతిపదికన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, యువకులు, స్వచ్చంధ సంస్థలు, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి, యువజన, మహిళ, పట్టణ సంఘాలతో వేదిక ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. 'ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై నియంత్రణ చట్టం తేవాలి'అనే అంశంపై టీయూడీఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరిగింది. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎన్ ఆశాలత, టీయూడీఎఫ్ (పట్నం) రాష్ట్ర నాయకులు డీఏఎస్‌వీ ప్రసాద్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ప్రధాన వక్తలుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా, వక్తలుగా టీయూడీఎఫ్ (పట్నం), ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డిజి నరసింహారావు, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు టి నాగరాజు, అనగంటి వెంకటేశ్, నగర కార్యదర్శులు ఎండీ జావిద్, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యకోసం మిలియన్ మార్చ్ : ఆకునూరి మురళి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించాలని కోరుతూ మిలియన్ మార్చ్ నిర్వహించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. అప్పుడే పాలకులు విద్యపై దృష్టికేంద్రీకరిస్తారని చెప్పారు. అందరం ఐక్యంగా ప్రభుత్వ విద్యారంగం బాగుకోసం పనిచేయాలని అన్నారు. విద్యతోనే సమాజం బాగుపడుతుందనీ, మనుషులకు వివేకం, ఆలోచన, ప్రశ్నించడం వస్తాయని వివరించారు. ఉపాధి అవకాశాల కోసం పోరాడతారని చెప్పారు. అందుకే విద్య ప్రాధాన్యత తెలిసిన పాలకులు అందరికీ చదువు అందించకుండా ప్రశ్నించకుండా ఉండేందుకు, తక్కువ కూలికి దొరికే కార్మికులను తయారు చేస్త్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యవైద్యం, పేదరిక నిర్మూలన, నిరుద్యోగం, ఉద్యోగాలు వంటి అంశాల జోలికి సీఎం కేసీఆర్ ఎవరినీ వెళ్లనీయడం లేదన్నారు. ప్రయివేటు విద్యాసంస్థలే అవసరం లేదనీ, అలాంటప్పుడు ఫీజుల నియంత్రణ ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందకపోవడానికి, మౌలిక వసతులు లేకపోవడానికి సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. అందరం ఐక్యమై ఓట్ల గండి కొడితే విద్యను కేసీఆర్ పట్టించుకుంటారని చెప్పారు.
ప్రయివేటు స్కూల్ అంటేనే దోపిడీ : శాంతాసిన్హా
ప్రయివేటు స్కూల్ అంటేనే విద్యాదోపిడీకి నిలయాలని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతాసిన్హా విమర్శించారు. మంత్రులు, అధికారులు ఈ దోపిడీలో భాగంగా ఉన్నారని చెప్పారు. ప్రయివేటు విద్యతో సమాజంలో అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. భూమి ఉన్నవారు, లేని వారి మధ్య అసమానతలు తక్కువనీ, చదువున్నవారికీ లేని వారికీ మధ్య అసమానతలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యతో వ్యక్తిగతంగా, కుటుంబం, దేశం బాగుపడుతుందన్నారు. విద్య వ్యాపారంగా మారిపోయిందని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం రాజకీయ ఎజెండాగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
విద్యావ్యాపారాన్ని అరికట్టాలి : డిజి నరసింహారావు
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల విద్యావ్యాపారాన్ని అరికట్టాలని పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విశాల వేదికను ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని చెప్పారు. ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా తర్వాత బడులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 20 నుంచి 30 శాతం తగ్గిందని చెప్పారు. వారంతా బాలకార్మికులుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానం పేరుతో మహిళలను మళ్లీ వంటగదికే పరిమితం చేసేలా బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి విమర్శించారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు టి నాగరాజు, అనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి రవి, నాయకులు రాజు, వెంకటేశ్, మధు, మల్ల మహేశ్, శివవర్మ, తిరుపతి, సాంబమూర్తి, శంకర్, శ్రీకాంత్, లెనిన్గువేరా, ఐద్వా నాయకులు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.