Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ
- శ్రీశైలం, నాగార్జునసాగర్ స్వాధీనానికి ప్రాధాన్యమివ్వాలంటూ సూచన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం కేఆర్ఎంబీ ఛైర్మెన్ లేఖ రాశారు. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లకు ఈమేరకు లేఖ పంపారు. ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల 13తో ముగిసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరస్ఫరం ఫిర్యాదు చేసుకున్నాయని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. గత ఏడాది జులై 15న కేంద్రజలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రెండు రాష్ట్రాలు అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపివేయాలని తెలియజేసింది. ఆదేశాలపై తగిన నివేదికలు ఇవ్వాలని గత సంవత్సరం జులైతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రెండు రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు గుర్తు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై చాలా వివాదాలు ఉన్నాయని బోర్డు పేర్కొంది. ఈ రెండు ప్రాజెక్టులకు చెందిన 15 కాంపొనెంట్లను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 15వ కేఆర్ఎంబీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరిందనీ, కాంపొనెంట్ల స్వాధీనానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయం అమలైతే వివాదాస్పద అంశాలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని కేఆర్ఎంబీ అ అధికారవర్గాలు భావిస్తున్నాయి.