Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందల సంఖ్యలో విద్యార్థులకు అస్వస్థత
- సొమ్మసిల్లి పడిపోయిన పలువురు
నవతెలంగాణ-బాసర
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. సుమారు 400 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను విడతల వారీగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్‌లో నిజామాబాద్‌లోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు వాంతులు, తలనొప్పితో ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రి ప్రాంగణం విద్యార్థులతో కిటకిటలాడింది. పలువురు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ పి.సతీష్ కుమార్ తెలిపారు. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురయ్యారు. ఇలా సుమారు 400 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎక్కువ మంది విద్యార్థులకు యూనివర్సిటీలోని ఆస్పత్రిలోనే వైద్య సేవలందించారు. ఒకేసారి వందల సంఖ్యలో విద్యార్థులు తరలిరావడంతో యూనివర్సిటీ అధికారులు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులకు సమాచారం అందించారు. ముధోల్, బాసర, భైంసా వైద్య సిబ్బంది వచ్చి యూనివర్సిటీ ఆస్పత్రిలో విద్యార్థులకు వైద్య సేవలందించారు. ఎస్ఎస్ క్యాటరింగ్ సంస్థ సుమారు మూడు వేల మంది విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తోంది. మధ్యాహ్నం భోజనంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ యూనివర్సిటీకి వెళ్లడానికి యత్నించగా.. ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.