Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపక్ష పార్టీలను కలుపుకుని పోవాలని నిర్ణయం
- పలువురు సీఎంలతో కేసీఆర్ చర్చలు
- సమాఖ్య, లౌకిక, ప్రజాస్వామ్య విలువలు కాపాడదామంటూ పిలుపు
- నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
- ఆ మేరకే ఎంపీలకు దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివిధ అంశాల్లో అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరులపై సమరశంఖం పూరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా కలిసొచ్చే అన్ని రాష్ట్రాల విపక్ష పార్టీలను సమన్వయం చేసుకుంటూ పోవాలని ఆయన భావిస్తున్నారు. తద్వారా మోడీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. బీజేపీ పాలనలో ప్రమాదంలో పడుతున్న సమాఖ్య, లౌకిక వ్యవస్థలు, ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు కేసీఆర్ మరింత పదును పెట్టనున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. 'దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేయాలి, పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ దమన నీతిపై పోరాడాలి, ఇదే సమయంలో దేశవ్యాప్త నిరసనలతో కేంద్ర ప్రభుత్వ అసలు స్వరూపాన్ని నగంగా నిలబెట్టాలి...' అని కేసీఆర్ నిర్ణయించినట్టు సీఎంవో తెలిపింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన పలు రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలతో ఫోన్లో మంతనాలు జరిపారు. పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు.
జాతీయ నేతలతోనూ చర్చలు కొనసాగించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ, తమిళనాడు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, స్టాలిన్, బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్‌తోపాటు శరద్ పవార్ సహా అనేక మందితో కేసీఆర్ ఫోన్లో స్వయంగా మాట్లాడారు. కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా కేసీఆర్ చేసిన ప్రతిపాదనల పట్ల వారు సానుకూలంగా స్పందించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ సందర్భంగా పేర్కొంది. మరోవైపు ఇవే అంశాలపై పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలేయాలని సీఎం... తన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకనుగుణంగా శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఆయన టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో తమ పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహం, విధి విధానాలపై ఆయన వారితో చర్చిస్తారు. తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర నిరసనను తెలపాలని ఆయన ఎంపీలకు సూచించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణను ప్రోత్సహించాల్సింది పోయి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసేందుకు కేంద్రం కుటిల యత్నాలు చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు తదితరాంశాల్లో తమ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యాచరణతో అనతికాలంలోనే అందరి అంచనాలను మించి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో కేంద్రం... తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా ఇటు రైతులు, మిల్లర్లు, అటు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న తెలంగాణ పట్ల కేంద్రం పొంతనలేని వ్యాఖ్యలు, ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి దుర్మార్గ వైఖరిని ఎండగట్టాలంటూ ఆయన ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఉపాధి పథకానికి సంబంధించి రాష్ట్రంలో కొనసాగుతున్న ఆడిట్‌పై కేంద్రం పలుమార్లు ప్రశంసలు కురిపించింది. అవార్డులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ... ఉద్దేశ పూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇలాంటి కుట్రలపై పార్లమెంటు వేదికగా నిలదీయాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. బీజేపీ సర్కారు అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ పతనమవుతున్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలు క్షీణిస్తున్న రూపాయి విలువనే అందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అభివృద్ధి సూచిక రోజురోజుకూ పాతాళానికి చేరుకుంటూ ప్రమాదకర స్థితిలోకి నెట్టబడుతున్నది. ఈ నేపథ్యంలో రూపాయి పతనంపై ఉభయ సభల సాక్షిగా కేంద్రాన్ని నిలేయాలంటూ ఆయన ఎంపీలకు సూచిస్తారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. పాలనలోనే కాకుండా రాజకీయ, సామాజిక తదితర అన్ని రంగాల్లోనూ కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, ఆధిపత్య ధోరణి వల్ల దేశంలో రోజురోజుకూ ప్రజాస్వామిక విలువలు దిగజారిపోతున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారని ఆయా వర్గాలు గుర్తు చేశాయి. ఈ క్రమంలో ఇలాంటి విధానాలను నిరసిస్తూ దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గొంతు విప్పాలంటూ తమ పార్టీ ఎంపీలకు కేసీఆర్ మార్గదర్శనం చేయనున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటులో కలిసొచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కూడా కలుపుకుపోవాలని ఆయన శనివారం నిర్వహించబోయే భేటీలో వారికి సూచించనున్నారు.