Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బాసర త్రిపుల్‌ఐటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించాలని బాసర త్రిపుల్‌ఐటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌ను ఆమె ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వంటలు వండే సమయంలోనూ, విద్యార్థులకు భోజనాలను వడ్డించే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిజామాబాద్‌కు వెళ్లాలంటూ వెంకటరమణకు ఆదేశం
విద్యార్థులకు మెరుగైన సేవలను అందించేలా చర్యలు చేపట్టేందుకు వీలుగా నిజామాబాద్ ఆస్పత్రికి వెంటనే వెళ్లాలంటూ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఆస్పత్రి వైద్యులతో సమన్వయం చేసుకుంటూ నాణ్యమైన వైద్య సేవలందేలా చూడాలని ఆయనకు మంత్రి సూచించారు.
మెరుగైన వైద్యం అందించాలి :రేవంత్
బాసర త్రిపుల్‌ఐటీ మెస్‌లో కలుషిత ఆహారం కారణంగా 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం దిగ్భ్రాంతి కలిగించిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలనీ, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.