Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహాయక చర్యలు చేపడదాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ -హైదరాబాద్ బ్యూరో
వరద బాధితులను ఆదుకోవాలనీ, సహాయ చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదలచేశారు. భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టంతోపాటు, ఇండ్లు, రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. వరదనీరు ఇండ్లలోకి రావడంతో వస్తువులు, సరుకులు పూర్తిగా పాడయిపోయాయని తెలిపారు. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన భద్రాచలం, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారనీ, వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. పార్టీ యంత్రాంగమంతా ఆయా జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో తక్షణమే పర్యటించి అవసరమైన సహాయక చర్యలు అందించాలని కోరారు. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా వస్తు, నగదు రూపేణా విరాళాలు సేకరించి రాష్ట్ర కేంద్రానికి పంపాలని సూచించారు.