Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాపసభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి, కార్మికవర్గ నేత డివి కృష్ణ ఆచరణాత్మక కమ్యూనిస్టు అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. డివి కృష్ణ సంతాప సభ శుక్రవారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో ప్రజాపంథా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఎం హన్మేష్ అధ్యక్షతన నిర్వహించారు. కీర్తి కిసాన్ యూనియన్ (కేకేయూ) పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి రశ్పాల్సింగ్ మాట్లాడుతూ ఆయన జీవితాంతం ఉద్యమాలు నిర్మిస్తూ వివిధ సమస్యలపై పోరాటం చేసిన మహనీయుడని చెప్పారు. ఆయన మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని నష్టదాయకమని అన్నారు. కేకేయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ధన్వాల్సింగ్ మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మోడీ, షా ప్రభుత్వం పనిచేస్తున్నదని విమర్శించారు. మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడి పార్లమెంటులో ఆమోదించిన వాటిని రద్దు చేయించిన ఘనత రైతాంగానిదని చెప్పారు. రెడ్ఫ్లాగ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ ప్రశ్నించేవారిని మోడీ ప్రభుత్వం జైల్లో పెడుతున్నదని విమర్శించారు. ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో డివి కృష్ణ అవసరం, ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంథా రాష్ట్ర నాయకులు కెజి రాంచందర్, కె రమ, కె సూర్యం, ఎస్ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు.