Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుక మేటలు వేసిన పొలాలు
- రహదారులకు గండ్లు
- నిలిచిన రాకపోకలు
- కరెంట్ లేక చీకట్లో కష్టాలు
నవతెలంగాణ- విలేకరులు
వారం రోజుల వర్షాలు మిగిల్చిన నష్టాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు నిండి వరద రోడ్లు, ఊర్లను చుట్టుముట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వం తడిచి కట్టుబట్టలతో మిగిలారు. చెరువులకు గండ్లు పడి పరిసర ప్రాంతాల పంట పొలాలను మునిగిపోయాయి. వారం రోజులు నీటిలో ఉండటం వల్ల పైర్లు మురిగిపోయాయి. పంట నష్టాలను అంచనా వేసేందుకు అధికారులు గ్రామాల్లో పరిశీలిస్తున్నారు. రహదారులు కొట్టుకుపోయి రవాణా బంద్ అయింది. బ్రిడ్జీలు తెగిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురై పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయి.
జగిత్యాల జిల్లాలో 38 రహదారులకు గండ్లుపడి రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం కూడా సుమారు 56 రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పంటలూ పెద్దఎత్తునే దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 12వేలా 588 మంది రైతులకు చెందిన 22వేల 992 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసిన వరద తాకిడికి భూములు కోతకు గురయ్యాయి. మరోపు 216 విద్యుత్స్తంభాలు పడిపోగా 85 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లో మరమ్మతులు వేగంగా సాగుతున్నా.. ఇప్పటికీ కొన్ని గ్రామాలు చీకట్లోనే ఉండిపోయాయి. పెద్దపల్లి జిల్లా పరివాహక ప్రాంతంలో ఉన్న గోదావరి ఉగ్రరూపందాల్చింది. 1995 అక్టోబర్ 10 సముద్రమట్టానికి 14.3 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే ఈ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇన్నేండ్లకు ఏకంగా ఈ ప్రాంత గోదావరి నది 14.82మీటర్ల ఎత్తునుంచి ప్రవహించింది. మరోవైపు 14 మండలాల్లో 659 ఎకరాల్లో వరి, 6495 ఎకరాల్లో పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇక నీటమునిగిన పొలాలు, చేన్లు కనీసంగా మరో 10వేల ఎకరాల వరకు ఉంటుందని అంచనా. ఇదే జిల్లాలోని మంథనిని వరదనీరు చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలోని సివిల్సప్లయి గోదాముల్లో నీరు చేరింది. అందులో నిల్వ చేసిన సుమారు 2కోట్ల విలువైన 380 మెట్రిక్ టన్నుల బియ్యం, రూ.కోటి విలువైన 5లక్షల పాత గన్నీ సంచులు తడిచిపోయి నట్టు అధికారులు చెబుతున్నారు. 24గంటల పాటు జలదిగ్బంధంలో ఉన్న మంథని పట్టణం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. సుమారు 15కాలనీల ఇండ్లు నీట మునగడంతో బియ్యం, నిత్యావసర సరుకులు సహా నగదు వరదనీటితో పనికి రాకుండాపోయాయి. కనీసం మంచినీళ్లు లేక రోజంతా బిక్కుబిక్కుమంటూ మంథని పట్టణవాసులు గడిపారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 13 మండలాల్లో 334 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం ఇండ్లకు రూ.11.63లక్షల నష్టపరిహారం అందించనున్నట్టు అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 406 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాలోని మిల్లుల్లో ఆరుబయట కనీసంగా 95వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిందని అధికారులు అంచనా వేశారు.
వీర్నపల్లిలోనే 80పశువులు మృతి.. 49 జీవాలు గల్లంతు
వర్ష బీభత్సానికి రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో 80 పశువులు మృత్యువాతపడ్డాయి. 49 జీవాలు వరదలో గల్లంతయ్యాయి. సుమారు రూ.12లక్షల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. వీర్నపల్లిలోని మల్లతండాలో మూగజీవాలు ఎప్పటిలాగే మంగళవారం అడవికి మేతకు వెళ్లాయి. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో బాధితులు మూడ్రోజులు వెతికారు. భారీ వర్షాలకు తోడు, ఐదు రోజులుగా పడుతున్న ముసురుతో వాటి జాడ దొరకలేదు. శుక్రవారం వర్షం తగ్గుముఖం పట్టడంతో అటవీ ప్రాంతంలో వెతికారు. అప్పటికే వరదలో కొట్టుకుపోయిన జీవాల్లో 80కిపైగా బురదలో కాళ్లు దిగి లేవలేక మృతువాతపడ్డాయి. మరో 49 పశువులు గల్లంతైనట్టు తండా వాసులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.12లక్షల వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెగిన కాళేశ్వరం అంతర్రాష్ట్ర రోడ్డు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర వైపు వెళ్లే అంతర్రాష్ట్ర రోడ్డు శుక్రవారం ఉదయం తెగిపోయింది. దీంతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని సంవత్సరాలుగా రెండు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రోడ్డు మార్గాన రాకపోకలు సాగుతున్నాయి.