Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్లక్ష్యంలో సర్కారు
- గత అనుభవాలతో పాఠాలు నేర్చుకోరా ? :నిపుణులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు వరదలు వచ్చి కోట్ల రూపాయల విలువ చేసే లిప్ట్ పంపులు నీట మునిగాయి. ఇటీవలకాంలలో ఇవి సర్వసాధార ణమయ్యాయి. గతంలో కూడా కల్వకుర్తి ప్రాజెక్టులోని ఎనిమిది పంపులు వరదల్లో మునిగిపోయాయి. వరదలు వచ్చినప్పుడు లిప్ట్ పంపులు మునగడం సహజమేనని ఇంజినీర్లు చెబుతుండటాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. కాళేశ్వరం వద్ద వరద నీటిలో మునిగిన అన్నారం, మెడిగడ్డ పంపులను అరబెట్టి తిరిగి పని చేయించవచ్చంటూ తేలిగ్గా చెప్పడం ఎంతమాత్రం సరికాదని అంటున్నారు. మానవతప్పిదంతో జరిగే కోట్ల రూపాయల నష్టాన్ని కప్పిపుచ్చడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
పంపుసెట్టు నీటిలో మునిగిపోతే బురద పేరుకుపోయి పంపుసెట్లలో ఉన్న రాగికండక్టర్కు అతుక్కుంటుంది. అలాగే విద్యుత్ పరికరాలకు స్విచ్లకూ ఒండ్రు పట్టి పాడైపోతాయి. వాటన్నిటిని మార్చి కొత్తవి అమర్చాల్సిందే. ఉదాహరణకు రైతుల పంపుసెట్లు వరదలో తడిసినప్పుడు కండక్టర్ మొత్తం తీసివేసి రీ-వైండింగ్ చేయించడం తప్ప మరో మార్గం ఉండదు. ఒండ్రు పట్టకుండా మంచినీళ్ళలో పంపుసెట్టు మునిగిప్పుడు దాని భాగాలు వీడదీసి అరబెట్టి తిరిగి వార్నీష్ చేసిన తర్వాత పని చేయించడానికి అవకాశం ఉంటుంది. కానీ వరదలో ఒండ్రు మట్టి తాకినతరువాత రీ-వైండింగ్ తప్ప మరో మార్గం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సహజంగా పంపుసెట్ల ఏర్పాటు వరదలు వచ్చిన మునగకుండా నిర్మాణం చేయాలి. ఒక వేల ముంపు ఎర్పడే ప్రాంతంలో పంపుసెట్టు బిగించకూడదు. పంపుసెట్లల్లోకి నీరు చేరకుండా చూసుకోవాలి. జాగ్రత్త పడాలి. గతంలో పంపుసెట్లు వరదలో మునిగినప్పుడు కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆ అనుభవాన్ని పురస్కరించుకుని తిరిగి అలాంటి ఘటనలు జరగకుండ చూసుకోవాల్సిన బాధ్యత ఇటు సాగునీటి శాఖ, అటు సర్కారుపై ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు లిప్ట్లకు 4750 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇంత భారీ కరెంటు వినియోగించే పంపును ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిర్వహణ సైతం అదేస్థాయిలో ఉండాలి కూడా. గతంలోనే ఒకసారి ప్రమాదం చోటుచేసుకుంది. తిరిగి వరదలకు మళ్లీ పంపులు మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాను, దాని పరికరాలను, సబ్స్టేషన్లు, పంపులను అత్యంత అప్రమత్తంతో అమర్చాలి. కాగా అ నిర్లక్ష్యాన్ని సమర్ధించుకునేలా ఇంజినీర్లు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రంలో లిప్ట్ పథకాలకు మొత్తంగాను 13 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం. దీనిని బట్టి విద్యుత్ లేకుండా ఏ పథకమూ పనిచేయదనే సంగతి స్పష్టమవుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరుతో వేల కోట్లు భరిస్తున్నది. వీటికి తోడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరింత నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ భారమంతా ప్రజలు పన్నుల ద్వారా చెల్లించాల్సి వస్తుందనే కఠిన వాస్తవాలను ఇంజినీర్లు గుర్తించకపోవడం దారుణమనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ అధికారులు ప్రజల అస్తులకు నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వైపు వరదలు వస్తుంటే, మరో వైపు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తుండటంతోనే ఈతరహా ప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో శ్రీశైలంకు వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తమని నీటిపారుదల శాఖా మంత్రికి పదే పదే చెప్పినా పట్టించుకోకపోవడంతో, వరద ఎదురుతన్ని కర్నూల్ పట్టణం పూర్తిగా వరద బురదతో నిండిపోయిన సంగతి తెలిసిందే. ఈ నష్టాన్ని ఎవరు భరించాలి ? ఆ పట్టణం బాగు కావడానికి ఆరు నెలలు పట్టింది. ఈనేపథ్యంలోనే బాధ్యతలను విస్మరించిన, నిర్లక్ష్యం చేసిన వారి నుండి ఈ నష్టాలను రాబట్టాలనే డిమాండ్ సాగునీటిరంగ నిపుణుల సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు.