Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలి
- కట్ ఆఫ్ డేట్‌ను కనీసం 2018 వరకూ పొడిగించాలి
- మీడియాతో ఇష్టాగోష్టిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయమంటూ ధీమా
- ముందస్తుకు వెళ్లేది లేదని స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోడు సాగుదార్ల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, అయితే కేంద్రమే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని సవరించాలని కోరారు. ఆ చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం 2005 వరకూ కట్ ఆఫ్ డేట్ ఉందని తెలిపారు. అందువల్ల ఆ డేట్‌ను కనీసం 2018 వరకైనా పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. పోడు భూములను స్వాధీనం చేసుకున్న వారిలో గిరిజనులు, గిరిజనేతరులూ ఉన్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆర్వోఎఫ్ఆర్ చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. గిరిజన మహిళను రాష్ట్రపతి చేస్తామంటున్న బీజేపీ... అదే సమయంలో గిరిజనుల హక్కులను లాక్కునేలా బిల్లు తీసుకురావటం దారుణమన్నారు. పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు దీన్ని అడ్డుకుంటారని చెప్పారు.
శుక్రవారం హైదరాబాద్‌లో కేటీఆర్... మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, దాని మతోన్మాద చర్యలు, అనేకాంశాల్లో రాష్ట్రానికి మొండి చేయి, కాంగ్రెస్ పరిస్థితి, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు, ఉద్యోగులకు జీతభత్యాలు ఆలస్యమవటం, వర్షాలు, వరదలు, సహాయక చర్యలు తదితరాంశాలపై ఆయన ఈ సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సోదాహరణలతో కూడిన సమాధానాలిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవటం ద్వారా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర పార్టీలు చేసిన సర్వేలన్నీ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయని అన్నారు. ఎనిమిదేండ్ల పాలన తర్వాత కూడా తమ పార్టీకి, ప్రభుత్వానికి మంచి స్పందన రావటమే ఇందుకు కారణమని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, కరుణానిధి, జయలలిత లాంటి మహా నేతలకు సైతం సీఎంగా హ్యాట్రిక్ కొట్టటం సాధ్యం కాలేదని గుర్తు చేశారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారమే (2023 డిసెంబరు) ఎన్నికలు జరుగుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన నేపథ్యంలో... 'వాళ్లు తేదీ ప్రకటిస్తే అసెంబ్లీని రద్దు చేస్తాం...' అంటూ సీఎం కేసీఆర్ మొన్నటి ప్రెస్మీట్లో సవాల్ విసిరారని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికంటే ఎక్కువగానే జీతాలిస్తున్నామని తెలిపారు. ఆ మేరకు వారి వేతనాలను తమ ప్రభుత్వం భారీగా పెంచిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో జీతాల చెల్లింపు అనేది పెద్ద సమస్య కాబోదని వివరించారు. పరిస్థితులనుబట్టి ఒక్కోసారి ఆలస్యమవుతుందని చెప్పారు. ఒకరోజు ముందూ.. వెనుకగా వేతనాలను చెల్లిస్తున్నాం కదా..? అని ఎదురు ప్రశ్నించారు. తమకు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం, రిపోర్టులను పరిశీలించి ప్రజల అవసరాల మేరకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని వివరించారు. రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని చోట్ల గొడవలుండటం సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్లో గొడవల నేవి తమ పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శ మని చెప్పారు. అయితే నేతలందర్నీ కలుపుకుని ముందు కు పోతామని తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇటీవలే తాను సీనియర్ నాయకులైన తుమ్మల, పొంగులేటి, జూపల్లి లాంటి వారితో భేటీ అయ్యానని చెప్పారు.
గుజరాత్‌కు అలా.. మనకు ఇలా...
హైదరాబాద్‌లో గతంలో వరదలు సంభవించినప్పుడు ఆర్థిక సాయం చేయాలంటూ కేంద్రాన్ని కోరామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే మనకు ఒక్క పైసా ఇవ్వని కేంద్రం.. గుజరాత్‌కు మాత్రం అడ్వాన్స్‌గా రూ.వెయ్యి కోట్లు ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోతుంటే... ఉపాధి హామీ పథకంలో అక్రమాలంటూ కేంద్ర బృందాన్ని ఇక్కడకు పంపారని విమర్శించారు. శత్రు దేశాలపై ఆంక్షలు పెట్టినట్టు తెలంగాణపై ఆర్థిక విషయాల్లో వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులపై సైతం కేంద్రం కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల రూపాయి విలువ నానాటికీ పడిపోతున్నదని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో మన దేశంలో ఏకత్వాన్ని రుద్దటమేంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ అప్రజాస్వామికంగా కూల్చివేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలన్నింటిపై దేశ ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు మూడు దెబ్బలు...
రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు మూడు భయంకరమైన దెబ్బలు తగలబోతున్నాయని ఆయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్నాటకలో ఆ పార్టీ ఓడిపోబోతోందని అన్నారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంత మంది మిగులుతారో చూడాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మేం లాక్కున్నామంటూ చాలా మంది విమర్శిస్తున్నారు.. కానీ రాజస్థాన్‌లో అదే కాంగ్రెస్ పార్టీ అక్కడి బీఎస్పీ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకుంది కదా..? అని ప్రశ్నించారు. బీజేపీ లాగా ప్రభుత్వాలను కూల్చేందుకు ఎమ్మెల్యేలను చీల్చితే తప్పుగానీ...తమంతట తామే టీఆర్ఎస్లో కలుస్తామంటూ వచ్చిన వారిని చేర్చుకుంటే తప్పేమీ లేదని కేటీఆర్ సూత్రీకరించారు.
బీజేపీది అహంకారం..
తమ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ బీజేపీ నేతలు చెప్పటమనేది వారి విర్రవీగుడికి, అహంకారానికి నిదర్శమని కేటీఆర్ విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సేను సైతం దేశభక్తుడంటూ పొగడటం వారికే చెల్లిందన్నారు. ఇప్పుడు కొత్తగా పార్లమెంటులో ఎలాంటి పదాలో వాడాలో కూడా బీజేపీయే చెబుతోందని అన్నారు. ఆ పార్టీ నేతలు మాత్రం 'గోలీ మారో సాలోకి...' అనే పదాలు యదేచ్ఛగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న వారినుద్దేశించి ప్రధాని మోడీ... 'ఆందోళన్ జీవి...' అంటూ వ్యాఖ్యానించటం సరైందేనా..? అని ప్రశ్నించారు.
మోడీ కంటే ముందున్న ప్రధానులందరూ కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే... ఒక్క ఆయన హయాంలోనే రూ.వంద లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. ఈ డబ్బులన్నీ ఏం చేశారని ప్రశ్నించారు. మోడీ కేవలం గుజరాత్‌కే ప్రధానిలా వ్యవహరిస్తున్నారు తప్ప దేశానికి కాదని ఎద్దేవా చేశారు. ఒక ప్రయివేటు అనధికారిక కార్యక్రమానికి వచ్చినందున్నే ఇటీవల ప్రధాని మోడీకి సీఎం స్వాగతం పలకలేదని చెప్పారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన గుజరాత్‌కు వెళితే... అప్పటి ఆ రాష్ట్ర సీఎం మోడీ స్వాగతం పలికారా..? అని ప్రశ్నించారు. తమకు నచ్చని వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టటం బీజేపీకి ఆనవాయితీగా మారిందన్నారు. అయితే మోడీ లేకపోతే ఈడీ అన్నట్టుగా ఆ పార్టీ వ్యవహరిస్తున్నదని తెలిపారు. కేసీఆర్ ఇలాంటి అదిరింపులు, బెదిరింపులకు భయపడబోరని అన్నారు. ధరణి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.