Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామ్కే వాస్తేగా కార్పొరేషన్లు
- లబ్దిదారుల ఎదురుచూపులు
- పెండింగ్లో 12 లక్షల దరఖాస్తులు
- ఇదీ..ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ కార్పొరేషన్ల దుస్థితి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని యువతకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీలుగా సబ్సిడీపై రుణాలు అందించేందుకోసం ఏర్పాటు చేసిన కార్పొ రేషన్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గతంలో అర్హులైన పేద వారికి అందించే సబ్సిడీ రుణాలు నేడు సంది గ్ధంలో పడిపోయాయి. స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకునే ప్రతీ ఒక్కరికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసే కార్పొరేషన్లు ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్సవ విగ్రహాలుగా మారాయి. ప్రస్తుతం ఒక్క దళితబంధు పథకాన్ని మినహాయిస్తే సబ్సిడీ రుణాల సంగతి అసలు పత్తాలేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించే ఆర్థిక భరోసా గత నాలుగైదేండ్లుగా ఊసే లేకపోవం గమనార్హం. కాస్తోకూస్తో ఆర్థిక సహాయాన్ని చేకూర్చే ఈ కార్పొరేషన్లు నేడు సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవ డంతో వీటిపై ఆధారపడిన ఎన్నో వేల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాయి.
పత్తాలేని ఎన్నికల హామీ
ప్రతీ ఒక్కరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తా మంటూ 2018 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నాలుగేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ రుణాల విషయాన్నే ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత ఐదేండ్లుగా ఎదురు చూస్తున్నా ఫలితం దక్కడం లేదు. నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్టు అధినేత ప్రకటనలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దళితులను ఆదుకోవడానికి దళితబంధు అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, వారికి మిగిలిన పథకాలను అందకుండా చేస్తోంది. తమకు ఎలాంటి పథకాన్ని అమలు చేయడం లేదనీ, పైగా ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలను నిలుపు చేశారని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. సబ్సిడీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల వద్ద నాలుగేళ్లుగా గుట్టలుగా పేరుకు పోతున్నాయని ఆయా వర్గాల వారు ఆరోపిస్తున్నారు.
12లక్షల దరఖాస్తుల పెండింగ్
రాష్ట్రలో సబ్సిడీ రుణాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సమర్పించిన దరఖాస్తులు కార్పొరేషన్ల వద్ద గుట్టలుగా పేరుకు పోతున్నాయి. అన్ని కార్పొరేషన్ల పరిధిలో కలిపి సుమారు 12లక్షలకు పైగా దరఖాస్తులు నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో 5,44,520 దరఖాస్తులు ఉండగా 12 ఫెడరేషన్ల దగ్గర 2.77లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
ప్రభుత్వ విధానంపై అసంతృప్తి..
ఏదేమైనా ఉమ్మడి రాష్ట్రంలో కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో సబ్సిడీ రుణాలకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు తప్పడం లేదని వారు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సబ్సిడీ రుణాలపై దృష్టి సారించాలనీ, దీనిలో భాగంగా యువత, నిరుపేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.