Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఐఏ సమ్మెలో నేతల డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వేతన సవరణను వెంటనే చేపట్టాలంటూ సాధారణ బీమా ఉద్యోగులు ఒక రోజు సమ్మె నిర్వహించారు. ఈ అంశంపై హామీనిచ్చి 60నెల్లు గడిచినప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం ఏ మాత్రం స్పందించటంలేదని విమర్శించారు. సాదారణ బీమా సంస్థల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ...శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ యునైటెడ్ ఇండియా రీజనల్ కార్యాలయంవద్ద 'ఒక రోజు సమ్మె నిర్వహించారు. నేషనల్, న్యూఇండియా, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కెవివిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ గత ఏబై ఏండ్లుగా ఇన్సూరెన్స్ రంగానికి ఒకే సారి వేతన సవరణ జరిగేదని గుర్తుచేశారు. ఈ ఆనవాయితీని ప్రభుత్వం పక్కన పెట్టటం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. జనరల్ ఇన్సూరెన్స్‌లో అనేక ప్రభుత్వ పథకాలను సామాన్య ప్రజలకు అందించటంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఉద్యోగుల హక్కులతోపాటు వేతన సవరణను నిరాకరించటం, ప్రభుత్వ రాంగాన్ని ప్రయివేటు పరం చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగంలో, సాధారణ బీమా కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తీవ్రంగా తగ్గుతున్నదని చెప్పారు. కొత్త ఉద్యోగులను నియమించటానికి కేంద్రం నిరాకరిస్తున్నదన్నారు. కాంట్రాక్టు,క్యాజువల్, అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా నిండిపోతున్నాయని చెప్పారు. ఇప్పుడు నూతన పద్ధతుల్లో ఆఫీసర్లు, అసిస్టెంట్లను అప్రెంటీస్ విధానం ద్వారా నియామకాలు చేపట్టటానికి ప్రయత్నాలు చేపట్టిందని తెలిపారు. ఎన్‌ఎఫ్‌జీఐఈ ప్రధాన కార్యదర్శి పీఎస్ బాజ్పై మాట్లాడుతూ బ్యాంకు, ఎల్ఐసీలోనూ వేతన సవరణ చేసి రెండేండ్లవుతున్నదని చెప్పారు. సాధారణ బీమా సంస్థ ఉద్యోగులకు ఎల్ఐసీతో పాటు ప్రతి సారి వేతన సవరణ జరిగేది కదా.. ఈ సారి వీరికి ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. కనీస చర్చలూ జరపటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్ఆర్జీఐఈఏ ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు మాట్లాడుతూ వేతన సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్ రద్దు చేసి ఉద్యోగులందరినీ 1995 పెన్షన్ స్కీమ్‌లోకి తీసుకురావాలనీ, కనీసం 30 శాతం 'ఫ్యామిలీ పెన్షన్' ఇవ్వాలని కోరారు. సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరించే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే వేతన సవరణ సాధించుకోగలుగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌జీఐఈ కార్యదర్శి గోపాలకృష్ణ, ఓఐసీఎఏ అధ్యక్షులు వై సుధాకర్‌రావు, ఎన్ఐఎఓఎ ప్రధాన కార్యదర్శి బి. విజయకుమార్, ఎన్ఐసీఓఏ అధ్యక్షులు టి రవీందర్, జీఐఈఎఐఎ అధ్యక్షులు ఎం శివశంకర్, నారాయణ రావు, భాస్కర్‌రావు మాట్లాడారు.