Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెడ్ ఆఫ్ అకౌంట్స్‌ను వెల్లడిస్తూ మెమో జారీ
- టీఎస్‌యూటీఎఫ్ హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగానికి అశక్తుడైన లేదా మరణించిన కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) ఉద్యోగుల కుటుంబాలకు పింఛన్ పొందేందుకు వీలుగా అవసరమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శనివారం మెమోను విడుదల చేశారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కుటుంబ ఫించన్ మంజూరు చేయాలంటే ఉద్యోగి ప్రాన్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగించాలంటూ షరతు విధిస్తూ 2021, జూన్ 11న జీవో నెంబర్ 58ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఏవిధంగా అప్పగించాలో ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. దీంతో మరణించిన ఉద్యోగుల వారసులు కుటుంబ పింఛన్ పొందలేక పోతున్నారు. అయితే ఈ విషయాన్ని గత ఏడాది కాలంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ పక్షాన ట్రెజరీ, ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తెచ్చి పలుసార్లు వినతిపత్రాలు సమర్పించిన ఫలితంగా తిరిగి చెల్లింపు మార్గదర్శకాలను, హెడ్ ఆఫ్ అకౌంట్ వివరాలను వెల్లడిస్తూ శనివారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకష్ణారావు మెమోను విడుదల చేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి తగిన ఉత్తర్వులు ఇవ్వడం పట్ల టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి హర్షం ప్రకటించారు.