Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవిష్యత్‌ను అంధకారం చేసుకోకండి
- పోరాటాలకు కలిసిరండి : టీఎస్ఆర్టీసీ కార్మికులకు జేఏసీ పిలుపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) తీసుకోవద్దని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కార్మికులకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలతో భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని కోరింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే సాధారణ ఆర్థిక ప్రయోజనాలే తప్ప, వీఆర్ఎస్ తీసుకుంటే అదనంగా వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. పైగా వీఆర్ఎస్ తీసుకుంటే ఎస్ఆర్బీఎస్ పెన్షన్ రాదనీ, బస్‌పాస్, తార్నాక ఆస్పత్రిలో వైద్యసౌకర్యాలు ఉండవని జేఏసీ హెచ్చరించింది. మరణిస్తే కనీసం దహన సంస్కారాల డబ్బులు కూడా ఇవ్వరని తెలిపింది. అనధికారికంగా స్వీకరిస్తున్న వీఆర్ఎస్ ధరఖాస్తుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి బస్‌భవన్‌లో మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ వినతిపత్రం ఇచ్చిన వెంటనే యాజమాన్యం సాయంత్రానికి అధికారికంగా వీఆర్ఎస్ అమలు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ఆర్టీసీ రెగ్యులేషన్స్ ప్రకారం కార్మికునికి ఐదేండ్ల సర్వీసు ఉంటే ఏడాదికి 15 రోజుల వేతనం, ఐదేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు సర్వీసు ఉంటే ఏడాదికి 20 రోజుల వేతనం, ఆపై సర్వీసు ఉంటే ఏడాదికి 25 రోజుల వేతనం మాత్రమే ఇస్తారని వివరించారు. దీనివల్ల కార్మికులకు నష్టమే తప్ప ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండబోవని తెలిపారు. తక్షణం యాజమాన్యం ఈ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం కార్మికులు జేఏసీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు.