Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి, అధిక వరదల కారణంగా ముంపునకు గురైన కుటుంబాలకు తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయమందించాలని సీపీఐ రాష్ట్ర ఇన్ఛార్జి కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రికార్డు స్థాయిలో గోదావరి నదికి వరదలు రావడంతో నదీ పరివాహక జిల్లాల్లో అధిక నష్టం వాటిల్లిందని కోరారు. ఈ వరదలతో అనేక మంది గ్రామాలను వదలి మెట్టప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన ఆహారపదార్థాలు అందించకపోవడం పట్ల పల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట పాత్రలు పూర్తిగా నీటమునిగిపోయాయనీ, వాటిని తిరిగి కొనుగోలు చేసే స్థితిలో వారులేరని ఆందోళన వ్యక్తం చేశారు. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టాలనీ, వరద తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందనీ, పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.