Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ వైద్య విధాన పరిషత్లో పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల జూన్ నెల వేతనాన్ని వెంటనే చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు బైరపాక శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు కలపి మొత్తం 120 ఆసుపత్రుల్లో సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నరని తెలిపారు. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ ఉద్యోగులు, నాలుగో తరగతి సిబ్బంది, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, ఇతర సిబ్బంది వేతనాలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ నెల జీతం జులై నెల ప్రారంభమై 16 రోజులు గడిచినా వేతనాలు అందకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు లోన్లు, ఇతర ప్రైవేట్ లోన్లను సకాలంలో చెల్లించలేకపోతున్నారని చెప్పారు. ఫలితంగా ఆయా బ్యాంకులు అపరాధ రుసుం వేస్తున్నాయని తెలిపారు. ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వేతనాలు చెల్లింపు కోసం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు మొదలుకుని నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి సిబ్బంది వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించకపోతే సోమవారం సాయంత్రం దశల వారి ఆందోళన పోరాటాల కోసం కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.