Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సారెస్పీ గేట్లు మూసివేత
- నిజాంసాగర్కూ తగ్గిన వరద
నవతెలంగాణ-మెండోరా/నిజాంసాగర్
రెండ్రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గింది. దాంతో గోదావరి శాంతించింది. అలాగే, ఇతర ప్రాజెక్టుల్లోకి కూడా వరద ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసేశారు. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గింది. దీంతో శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్సారెస్పీ అన్ని గేట్లను మూసేసినట్టు ప్రాజెక్టు ఏఈఈ సారిక తెలిపారు. క్రమంగా వరద ప్రవాహం తగ్గుతూ ప్రస్తుతం 26,510 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. ప్రాజెక్టును నింపుతున్నారు.
ఎస్కేప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతూ కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేరు డ్యామ్‌కు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 10 వేయిల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మిడ్ మానేరు డ్యామ్ నింపుతున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 140 టీఎంసీల వరద నీరు వచ్చి చేరగా.. 84 టీఎంసీల నీటిని బయటికి విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఎగువ నుంచి కొనసాగుతున్న వరద నీటితో ప్రాజెక్టును నింపుతుండగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 1088 అడుగుల (76.424 టీఎంసీల)కు చేరుకుంది.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతం నుంచి 2220 క్యూసెక్కుల నీరు మాత్రమే ఇన్‌ఫ్లో వస్తున్నట్టు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు( 17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1400.06 అడుగుల (11.425 టీఎంసీల) నీరు నిల్వ ఉంది.