Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు ప్రజల ముందు పెట్టండి : కేంద్రానికి మంత్రి కేటీఆర్ కౌంటర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి మోడీ లక్ష్యానికి అనుగుణంగా దేశంలోని ఎంతో మంది రైతుల ఆదాయం డబుల్ అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం చెపుతున్నది నిజమే అయితే అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను దేశ ప్రజల ముందు పెట్టాలని ప్రధానిని డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశ వ్యవసాయ రంగం అభివద్ది, రైతుల సంక్షేమం కోసం ఏ పథకాలను అమలు చేశారో చెప్పాలన్నారు. ఎన్ని లక్షల మంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందో ఆ వివరాలను బయటపెట్టాలని కోరారు.
రైతు వేషంలో మోడల్
కేంద్ర వ్యవసాయ శాఖ పెట్టిన పోస్టర్లో ఉన్న రైతు ఓ మోడల్ అని నెటిజన్లు తేల్చారు. నిజంగానే మోడీ ప్రభుత్వం అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తే ఆ విషయాన్ని ఒరిజనల్ రైతులతో చెప్పించాలి. ఇలా మోడల్స్‌ను ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం ఫేక్ న్యూస్‌తో దేశ ప్రజలను మోసం చేస్తోందని నెటిజన్లు మండిపడ్డారు.
అన్ పార్లమెంటరీనా?
అన్ పార్లమెంటరీ పదాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్లపైకి వచ్చిన దేశ ప్రజలను ''ఆందోళన్ జీవి'' అని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ అనొచ్చు... ''గోలీ మారో సాలోం కో'' అని ఒక కేంద్ర మంత్రి రెండు వర్గాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టొచ్చు.... అధికారం కోసం సమాజంలో చీలిక తెచ్చేలా 80-20 అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఏం తప్పులేదు...జాతిపిత మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ మాట్లాడితే ఏం ఫర్వాలేదు...దేశానికి అన్నం పెట్టే రైతులను ''టెర్రరిస్టులు'' అని పిలిస్తే కేంద్ర ప్రభుత్వం దష్టిలో ఓకే...ఇవన్నీ కూడా బీజేపీ సారధ్యాన కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వానికి నిరర్థక ఆస్తుల(ఎన్పీఏ)కు ఆమోదయోగ్యమైన పార్లమెంటరీ పదాలు అంటూ ఎద్దేవా చేశారు.