Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
75ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా సంచార జాతుల బతుకులు అత్యంత దుర్భరంగా ఉండటం విచారకరమని సంచార జాతుల మహాధర్నాలో వక్తలు విమర్శించారు. శనివారం తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ వద్ద సంచార జాతుల మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు పి ఆశయ్య మాట్లాడుతూ సంచార జాతులకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించాలనే న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు.2004లో నాటి కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల స్థితిగతులపై బాలకృష్ణరెనికే కమిషన్ వేసిందని చెప్పారు. ఆ కమిషన్ రిపోర్టును 2008లో ప్రభుత్వానికి అందజేసిందని తెలిపారు. ఆ కమిషన్ సిఫారసుల ప్రకారం వీరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ నాడు, నేటి బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎంబీసీలకు బడ్జెట్ కేటాయించినట్టు కాగితాల్లో చూపి ఖర్చు మాత్రం చేయటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆప్ నాయకురాలు ఇందిరా శోభన్, ప్రొఫెసర్ ఇనుకొండ తిర్మల్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఒంటేరు నరేందర్ అధ్యక్షత వహించగా అధ్యక్షులు వెంకటనారా యణతో పాటు సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.