Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిలారు తిరుపతయ్య అమరజీవిగా మిగిలిపోయాడు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-బోనకల్
సోషలిస్టు వ్యవస్థను సాధించటమే కమ్యూనిస్టుల ఆశయం అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కమ్యూనిస్టు ఆశయ సాధన కోసం కిలారి తరపతయ్య జీవితాంతం పోరాటాలు చేసి అమరజీవిగా మిగిలిపోయారని కొనియాడారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతు సంఘం నాయకులు కిలారు తిరుపతయ్య సంతాప సభ శనివారం జరిగింది. తొలుత తిరపతయ్య స్మారక స్థూపాన్ని తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. స్థూపం వద్ద సీపీఐ(ఎం) పతాకాన్ని పోతినేని సుదర్శన్రావు ఆవిష్కరించారు. స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లక్ష్మీపురం గ్రామ శాఖ కార్యదర్శి గుడ్డూరి వెంకట నరసయ్య అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని మాట్లాడారు. కిలారు తిరుపతయ్య ప్రధానంగా రైతు సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించారన్నారు. సాగర్ నీటి కోసం అనేక పోరాటాలు చేశారని చెప్పారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత చర్యలతో ముందుకెళ్తున్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని చెప్పారు. వ్యవస్థ మార్పు కోసం కమ్యూనిస్టులు పనిచేస్తారన్నారు. కమ్యూనిస్టులు ఆకలి తీర్చడానికి మార్గం చూపుతారని, కానీ బూర్జువా పార్టీలు ఆకలి వేస్తే అన్నం పెడతారని అన్నారు. దీనివల్ల ప్రజల బతుకులు మారవని చెప్పారు. సీఎం కేసీఆర్ మాట్లాడితే.. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని చెబుతారని అన్నారు. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో సీపీఐ(ఎం) పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.
తిరుపతయ్య తన జీవితాంతం ప్రజల కోసమే పని చేశారు : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
కిలారు తిరుపతయ్య తన జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పని చేసి ఎంతో నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. తిరుపతయ్య ఎప్పుడు, ఎక్కడ కలిసినా ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారన్నారు. ఎంతో మంచి మనస్తత్వం కలిగిన కిలారు తిరుపతయ్య అకాల మరణం చెందటం చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం రాజకీయాలు బ్రష్టు పట్టిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారు లేని లోటు మనం తీర్చలేమని, ఆయన వదిలిన ఆశయాల సాధన కోసం మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు
తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ స్ఫూర్తితో వారి వారసత్వాన్ని సీపీఐ(ఎం) శ్రేణులు, కార్యకర్తలు కొనసాగించాలని, అప్పుడే తిరుపతయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. తిరుపతయ్య రైతు సంఘం నాయకులుగా, నీటి సంఘం అధ్యక్షుడిగా, ఎంపీటీసీగా పనిచేసి ఆ పదవులకు వన్నెతెచ్చాడన్నారు. సభలో నవతెలంగాణ జనరల్ మేనేజర్ మన్నేపల్లి సుబ్బారావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, బొంతు రాంబాబు, చింతలచెరువు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, మాదినేని రమేష్, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు మాట్లాడారు.