Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2005కు ముందు సాగులో ఉన్న వాటిని పరిష్కరించాలి
- ఆ తర్వాతే కేంద్రాన్ని చట్ట సవరణ అడగాలి: తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
2005కు ముందు సాగులో ఉన్న పోడు భూములకు హక్కుపత్రాలివ్వాల్సిందేనని తెలంగాణ గిరిజన సంఘం (టీసీఎస్) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం- 2006 ప్రకారం.. 2005 డిసెంబర్ 13 కంటే ముందు సాగులో ఉన్న పోడు సాగుదారులందరికీ హక్కులు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపారు. పాత దరఖాస్తుదారులను నిర్లక్ష్యం చేయకుండా వారికి తక్షణం హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. తదనంతరం 2018 వరకు సాగులో ఉన్న వారందరికీ హక్కులు ఇచ్చేందుకు కటాఫ్ తేదీని పొడిగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని సవరించిన తరువాతనే పోడు సాగుదారులకు హక్కులు ఇస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 2018 వరకు సాగులో ఉన్న వారందరికీ హక్కులు ఇవ్వాలని అడగడం మంచిదేనని తెలిపారు. కానీ.. ఆ పేరుతో 2005కు ముందునుంచి సాగులో ఉన్న గిరిజనులు, పేదలకు హక్కులు కల్పించేందుకు ఆటంకాలేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. చట్టమే రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు కల్పించిందని గుర్తుచేశారు. ఆ హక్కును వినియోగించుకుని తక్షణం అర్హత కలిగిన వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వకుండా ఆ భూములనుంచి వారిని తొలగించటం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కులు కల్పించాల్సి ఉండగా ఉమ్మడి పాలకులు కేవలం 94 వేల మందికి 3లక్షల ఎకరాల పై మాత్రమే హక్కు పత్రాలిచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఎకరా పోడు భూమిపై కూడా హక్కు పత్రాలివ్వలేదని గుర్తుచేశారు. పైగా గత ఎనిమిదేండ్ల కాలంలో పోడు సాగుదారులపై దాడులు, లాఠీఛార్జ్‌లు, అక్రమ కేసులు పెట్టి వేలాది మందిని జైళ్లకు పంపి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నదని తెలిపారు. వేలాది ఎకరాల పోడు భూములను బలవంతంగా లాక్కున్నదని పేర్కొన్నారు. పోడు భూములకు హక్కులు కల్పించాలని గతేడాది గిరిజన, ప్రజా సంఘాలు, వామ పక్షాలు, ప్రతిపక్ష పార్టీలతో కలసి పోడు రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడిన పలితంగా హక్కులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. పోడు సాగుదారుల నుంచి గతేడాది నవంబర్‌లో 3.5లక్షల దరఖాస్తులను ప్రభుత్వం స్వికరించిందని తెలిపారు. ఏడునెల్లు గడుస్తున్నా వాటిని పరిశీలించి హక్కు పత్రాలివ్వడంలో సర్కారు పూర్తిగా విఫలమయిందని వారు ఆరోపించారు. ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే కేటీఆర్ చట్ట సవరణ నాటకాన్ని ముందుకు తెచ్చారని తెలిపారు.