Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-తుర్కయంజాల్
మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు, వేధింపులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ మన్నెగూడ క్రాస్‌రోడ్‌లోని వీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో రంగారెడ్డి జిల్లా ఐద్వా విస్తృతస్థాయి సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు విజయ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట మహిళలపై అనేక రకాలుగా దాడులు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఉపాధి లేక, మరోపక్క నిత్యావసర సరుకులు ధరలు ఆకాశానికి అంటుతుంటే మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేరళ, తమిళనాడులో ప్రభుత్వం రేషన్ ద్వారా 14 రకాల వస్తువులను ఇస్తున్నారని, తెలంగాణలో కూడా అటువంటి విధానాలను అమలు చేయాలని కోరారు. ప్రతి మహిళకు పొదుపు సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు, రెండు పడకల ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజం పట్ల అవగాహన పెంచుకుని అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సుమలత, శ్రామిక మహిళ నాయకురాలు కవిత, నాయకులు విజయ, కె.శారద, మమత, సంధ్య, ఉమా, లక్ష్మి , రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.