Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేఘ విస్పోటనం అంత ఈజీ కాదంటున్న నిపుణులు
- గతంలో మేఘమథనం వంటి చర్యలు విఫలం
- వాతావరణంలో మార్పుతోనే గోదారి ఉత్పాతమని వెల్లడి
(ఖమ్మం నుంచి కె.శ్రీనివాసరెడ్డి)
''క్లౌడ్ బరస్ట్ (మేఘ విస్ఫోటనం) అనే కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని వెనుక ఏదో కుట్రలున్నాయని చెబుతావున్నరు.. అది ఎంత వరకు కరెక్టో తెలియదు.. కానీ, ఇతర దేశాల వాళ్లు కాదలచుకొనే మనదేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరెస్టులు చేస్తా ఉన్నరు. గతంలో ఒకసారి కశ్మీర్ దగ్గర లేహ్‌లో, ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో చేశారు. ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతంలో చేస్తున్నరని మనకు గ్లూమీ గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటటు వంటి మార్పుల వల్ల ఇటువంటి ఉత్పాతాలు వస్తా ఉంటాయి.. కాబట్టి ఈ సందర్భంలో మనం ప్రజలను కాపాడుకోవాల్సి ఉంటది.'' అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాచలంలో ఆదివారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. స్థానిక ఐటీడీఏలో ఏర్పాటు చేసిన గోదావరి వరదల సమీక్ష -2022లో ముఖ్యమంత్రి వరద ఉత్పాతాన్ని క్లౌడ్ బరస్టు కుట్రగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసలు క్లౌడ్బరెస్టు సాధ్యాసాధ్యాలపై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర విభాగం ప్రధాన అధ్యాపకులు డాక్టర్ నర్సింగ్ శ్రీనివాసరావు విశ్లేషించారు.
క్లౌడ్ బరస్టు వెనుక...?
ఒక నిర్ధిష్ట ప్రదేశంలో భారీగా వర్షం.. ఒక ధారలా పడి కాసేపట్లో భారీ వరదలు ఉత్పన్నమైతే అది క్లౌడ్ బరెస్టు ప్రభావంగా భావించొచ్చు. ఆ వరదలకు ఒక్కోసారి సొరంగాల వంటివి కూడా ఏర్పడతాయి. సాధారణంగా వర్షం గంటకు 70 మి.మీ పడితే భారీ వర్షంగా భావిస్తాం. క్లౌడ్ బరస్టు జరిగినప్పుడు మాత్రం అది గంటకు 100 మి.మీ కంటే ఎక్కువగా కుండపోతగా కురుస్తుంది. ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయి. పైకి వెళ్లిన నీటి ఆవిరి లిక్విడ్‌గా మారి గాలి వాటాన్ని బట్టి సంభవిస్తుంటాయి. అయితే ఇవి ఫలానా చోటే నిర్ధిష్టంగా సంభవిస్తాయని మాత్రం చెప్పలేము. దీని వల్ల వచ్చే వరదలకు ఇండ్ల్లు పునాదులతో సహా కొట్టుకుపోతాయి. ఆ మధ్య ఉత్తరాంచల్‌లో వచ్చిన క్లౌడ్ బ్లాస్టింగ్‌ను అవలాంచ్ (హిమపాతం)గా తేల్చారు. ఇవి ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, తదితర కొండ ప్రాంతాల్లో చోటుచేసుకుంటాయి. పెహల్గామ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటువంటి వర్షాలు చోటు చేసుకున్నాయి.
నిర్ధిష్ట ప్రదేశంలో క్లౌడ్ బరస్టు చేయలేం...
కృత్రిమంగా క్లౌడ్ బరస్టు చేయవచ్చా.. అంటే చేయవచ్చు. కానీ ఎంపిక చేసిన చోట వర్షం పడటం అసాధ్యం. మేఘాల్లోకి కార్బన్డయాక్సైడ్, సోడియం క్లోరైడ్, మరీ ముఖ్యంగా సిల్వర్ అయోడెడ్ పంపుతారు. దీనివల్ల మేఘాలు చల్లగా మారి 20-30 కి.మీ విస్తీర్ణంలో వర్షాలు పడుతాయి. గంటకు 10 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ కృత్రిమ మేఘ విస్ఫోటనం వికటించే అవకాశాలే ఎక్కువ. గతంలో బెంగళూరులో వర్షాల కోసమని సిల్వర్ అయోడెడ్ను పంపారు. ఆ రుతుపవనాల ప్రభావం చెన్నైపై పడిందని పరిశీలకుల మాట. భూతలం నుంచి వెయ్యి మీటర్ల ఎత్తులో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రుతుపవనాలు మనం ఎంపిక చేసుకున్న చోట సంభవిస్తాయని చెప్పలేం.
మేఘమథనం కూడా ఇటువంటిదే...
తక్కువ వర్షపాతం ఉన్న చోట మేఘ మథనం వంటివి చేస్తుంటాం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి, రఘువీరారెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.100 కోట్లు వెచ్చించి కర్నూల్ వంటి చోట మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ అదో విఫలయత్నమే అయ్యింది. ఇప్పటికీ దీనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలే ఈ ఉత్పతాలకు కారణం కానీ మేఘ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్ట్) వంటివి అంత ఈజీగా సక్సెస్ కావు. అయినా మనం ఎంచుకున్న చోట సంభవించవు. వాతావరణంలో మార్పులే వరదలకు ప్రధాన కారణం.