Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలోని మత్య్సకారులు, మత్య్స సంపదకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, ఆ నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని తెలంగాణ మత్య్సకారులు, మత్య్స కార్మిక సంఘం(టీఎంకేఎంకేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరింకల నరసింహా, లెల్లెల బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మత్య్సకారులకు జరిగిన వరద నష్టంపై చర్చించారు. వందలాది చెరువులు, కుంటలకు గండ్లు పడి వేలాది టన్నుల చేపలు, మత్య్ససంపద వరదల్లో కొట్టుకుపోయిందని వారు తెలిపారు. మత్య్స కారులకు భారీ నష్ట జరిగిందని పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, జల వనరుల పక్కన నివసించేది మత్య్స కారులేనని తెలిపారు. వారికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గండ్లుపడిన చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లలను టెండర్ల ద్వారా కాకుండా మత్య్స సొసైటీలకు బ్యాంకు ఖాతాలో నగదు జమ జమచేయడం ద్వారా అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేశారు. మత్య్ససొసైటీలే నేరుగా చేప పిల్లల కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలనీ, అవినీతి లేకుండా..మధ్యదళారీ విధానాన్ని తొలగించాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పగడాల నాగేశ్వరరావు, మూఠా విజరు కుమార్, రాష్ట్ర కార్యదర్శి బోడంకి చందు, రాష్ట్ర కమిటీ సభ్యులు గాండ్ల అమరావతి, శీలం శ్రీను, మూఠా దశరథ్, మామిండ్ల జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.