Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెగా టెక్స్టైల్ పార్క్ భూ సేకరణ నిరాకరణ
- భూమి బదులు.. భూమి ఇస్తేనే..
- ఎకరాకు రూ.50 లక్షల డిమాండ్
- సర్వే కొచ్చిన రెవెన్యూ అధికారులను వెనక్కి పంపిన రైతులు
నవతెలంగాణ-సంగెం
రైతులకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చినా పట్టించుకోకుండా భూ సర్వే కోసం వచ్చిన కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు యాజమాన్యాన్ని రైతులు అడ్డుకొని 'ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వం' అంటూ వ్యతిరేకించారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం గతంలో 1200 ఎకరాలు సేకరించినా, ఇంకా 27 ఎకరాలు అవసరం కావడంతో భూ సేకరణ కోసం యాజమాన్యం ముందుకు కొచ్చిన క్రమంలో 17 మంది రైతులు వ్యతిరేకించి గతేడాది డిసెంబర్లో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
భూ నిర్వాసిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ కోసం గతంలోనే రైతులు తమ భూమిని తక్కువ రేటుకు ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు వారికి సంబంధించిన మిగులు భూములనే అదే రేటుకు ఇవ్వమని అడగటంతో రైతులు నిరాకరించారు. తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చి నష్టపోయామని, మళ్లీ ఇచ్చేది లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీసుకొండ మండలం శాయంపేట గ్రామశివారులో సంగెం మండలం కుంటపల్లి, కాట్రపల్లి గ్రామాలకు చెందిన 17 మంది రైతుల వ్యవసాయ భూములు, బావులు సుమారు 27ఎకరాల విస్తీర్ణం భూమి ఉంది. ఈ భూములు టెక్స్టైల్ పార్క్ కోసం తీసుకోవడానికి ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపారు. రైతులు ఇవ్వమని తెలుపడంతో ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణకు చర్యలు చేపట్టడంతో రైతులు కోర్టు మెట్లెక్కారు. కోర్టులో కేసులుండగా పోలీసు బలగాలతో రెవెన్యూ అధికారులు, టీఎస్ఐఐసీ అధికారులు మంగళవారం భూములను సర్వే చేయడానికి వచ్చారన్నారు. రైతులు అడ్డుకొని కోర్టులో కేసు ఉండగా ఎలా సర్వే చేస్తారని, కోర్టు సర్వే చేయమని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిందా.. అంటూ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమకున్న కొద్దిపాటి భూములు తీసుకుంటే తాము, తమ పిల్లలు ఎలా బతకాలని, తమ ఆడపిల్లలకు వరకట్నం కింద ఈ భూములను రాసి ఇచ్చామని, ఇప్పుడు మీరు తీసుకుంటే ఆడపిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. కాగా, రైతులు కావటి వెంకటయ్య, గాయపు మాధవరెడ్డి, చింతిరెడ్డి బుచ్చిరెడ్డి.. పురుగుల మందు తాగడానికి ప్రయత్నించగా మందు డబ్బాలను పోలీసులు లాక్కున్నారు. సంఘటన స్థలానికి వచ్చిన వరంగల్ అర్డీవో మహేందర్జీ, టీఎస్ఐఐసీ అధికారులు, మామునుర్ ఏసీపీ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలు, కోర్టు ఆదేశాల మేరకే భూముల సేకరణ కార్యక్రమాన్ని చేపడతామని రైతులకు తెలిపారు. దాంతో రైతులు శాంతించారు.