Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి:
- రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం పట్టణానికి ముప్పు పొంచి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్‌ను మార్చి మూడు మీటర్లు ఎత్తు పెంచటం వల్లే పట్టణం ముంపునకు గురైందని ఆయన చెప్పారు. తెలంగాణలో గోదావరి వరదల నివారణకు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలనీ, అందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనససభాపక్ష కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలంటూ మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల సంభవించిన వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముంపు భాదితులు వచ్చి మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని తెలిపారు. పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు టీఆర్ఎస్ నిరసన తెలిపిందని చెప్పారు. ఏపీలో విలీనమైన ఏడు మండలాలను తెలంగాణలో కలపాలనీ, ముఖ్యంగా భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను మన రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని కోరారు.
ఇదే సమయంలో తన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు ఖండించడంపై పువ్వాడ స్పందించారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేంటో అర్థం కావడం లేదన్నారు. ఏపీ మంత్రుల తీరు బాధాకరమని చెప్పారు. ప్రజలు, దేవుడు మునగకుండా కరకట్టల నిర్మాణానికి ఐదు గ్రామాలను ఇవ్వాలంటూ తాము కోరుతున్నామన్నారు. మాకు హైదరాబాద్‌ను ఇస్తారా? అంటూ మంత్రి బొత్స మాట్లాడటం అసందర్భం.. అర్ధరహితమని పేర్కొన్నారు. భద్రాద్రి రాముడు నీటిలో మునిగిపోతుంటే ఆంధ్రా ప్రజలకు కూడా బాధ కలుగుతోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపితేనే రాములోరి దేవస్థానానికి కరకట్ట నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చర్చలకు వచ్చేలా మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అపార్థాలకు తావివ్వకుండా వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కలిసి పనిచేద్దామని పువ్వాడ ఈ సందర్భంగా కోరారు. విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఎమ్.నాగేశ్వరరావు, హరిప్రియా నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి ప్రజా సమస్యలు పట్టవు : ఎమ్మెల్యే కోరుకంటి చందర్
బీజేపీకి, ఆ పార్టీ నేతలకు ప్రజా సమస్యలు పట్టబోవని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఒకపక్క రాష్ట్రంలోని ప్రజలు వరదలతో సతమతమవుతుంటే వాటి గురించి పట్టని బీజేపీ నేతలు ప్రెస్మీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. ఆ పార్టీకి ఓట్లు కావాలి తప్ప ప్రజలు పాట్లు కాదని అన్నారు.