Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటి జాతీయకరణను ఆనాడు జనసంఫ్‌ు వ్యతిరేకించింది
- అందుకే ఇప్పుడు వాటి ప్రయివేటీకరణకు మోడీ సర్కారు యత్నం
- దేశ ఆర్థికాభివృద్ధికి పబ్లిక్ సెక్టారే వెన్నెముక
- పేదలకు భూములు పంచింది కమ్యూనిస్టులు
- అన్నింటినీ అమ్మేసే మోడీ సర్కారుకు దేశభక్తి అంటే ఏం తెలుసు ?
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోని బ్యాంకుల ప్రయివేటీకరణ వల్ల అంతిమంగా నష్టపోయేది సాధారణ ప్రజానీకమేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మోడీ సర్కారు తీసుకురాబోయే బ్యాంకుల ప్రయివేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా నిలబడి పోరాడుతుందని హామీనిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం వచ్చినా మన దేశం దాని ప్రభావానికి గురికాలేదనీ, దేశాభివృద్ధికి పబ్లిక్ సెక్టార్ వెన్నెముకగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని నొక్కి చెప్పారు. ప్రభుత్వాస్తులన్నింటినీ కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీకి దేశభక్తి గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. దేశం, పేదల జీవితాలు బాగుండాలని భవిష్యత్ గురించి ఆలోచించి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసిన నెహ్రూ దేశభక్తి ముందు బీజేపీ నేతలెంత? అని అన్నారు. మిశ్రమ ఆర్థిక విధానం మన దేశానికి ఎంతో దోహదపడ్డదన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో తొమ్మిదేండ్లకుపైగా జైలు జీవితం గడిపిన నెహ్రూపై కొన్ని దుర్మార్గ శక్తులు తీవ్ర అసత్య ప్రచారాలకు పూనుకున్నాయని విమర్శించారు. కమ్యూనిస్టుల నేతృత్వంలోని అప్పటి సోవియట్ రష్యా మన దేశాభివృద్ధికి సహాయం చేసిందని గుర్తుచేశారు. వేలాది మంది పేదలకు భూములను పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టులదని కొనియాడారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి ఇందిరాగాంధీ కూడా మంచి పని చేశారన్నారు. బ్యాంకుల జాతీయకరణకు 53 ఏండ్లు అవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏఐబీఈఏ అనుబంధం) ఆధ్వర్యంలో 'బ్యాంకుల జాతీయకరణ-ఆర్థికాభివృద్ధి' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. దీనికి ఆ ఫెడరేషన్ అధ్యక్షులు టి.రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ..బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చాక దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వ బ్యాంకులు నిబంధనల ప్రకారం నడుచుకోవటం వల్లనే నేడు అవి మంచి పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఎంతో ఆర్భాటం చేసిన ప్రయివేటు బ్యాంకులు ఎన్నో మూతపడ్డాయని వివరించారు. ప్రయివేటు రంగంతో సేవలు విస్తృతం అవుతాయనీ, పనిలో వేగం పెరుగుతుందనీ, అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల సరిగా పనిచేయరనే ప్రచారాన్ని పాలకవర్గాలు ప్రచారంలో పెట్టి వాటిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు నిక్కచ్చిగా పనిచేయడం వల్లనే ఆ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, సామాన్య ప్రజలకు కూడా సేవలు అందించగలుగుతున్నాయని కొనియాడారు. అదే ప్రయివేటు బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తున్నాయా? అని ప్రశ్నించారు. మన దేశంలోని ప్రజలు ఎంతో కొంత మంచి స్థితిలో ఉన్నారంటే అది ప్రభుత్వ రంగ సంస్థల పుణ్యమేనన్నారు. పబ్లిక్ సెక్టార్‌లోని మానవీయత లక్షణం ప్రయివేటు సెక్టార్లో ఉండదని నొక్కిచెప్పారు. బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. లేకపోతే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడుతున్నాయని హెచ్చరించారు. ఇన్సూరెన్స్ రంగంలో కింగ్ ఎల్ఐసీనేన్నారు. ప్రయివేటు రంగంలో ఎన్ని కంపెనీలు వచ్చినా దాని ముందు నిలబడలేకపోయాయనీ, అందుకే ఆ సంస్థను నేడు అమ్మేయాలని మోడీ సర్కారు చూస్తున్నదని విమర్శించారు. సైనికులకు పెన్షన్ రద్దు చేయడం కోసం అగ్నిపథ్‌ను తీసుకొచ్చి దేశభద్రతనే ప్రమాదంలోకి నెట్టడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఓ వ్యక్తి మూడున్నరేండ్లు పనిచేశాక పక్క దేశంతో యుద్ధం వస్తే ప్రాణాన్ని అడ్డం పెట్టి ముందుండి పోరాడటానికి ఎవరైనా ముందుకు వస్తారా? అని ప్రశ్నించారు. సైనికులకు ఒక నిబద్ధతతో కూడిన శిక్షణ, మానసిక దృఢత్వం పెంపొంచే వ్యవస్థకు తూట్లు పొడవటం మంచిది కాదన్నారు. అగ్నిపథ్‌నూ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. డీమానిటైజేషన్ సందర్భంగా మోడీ సర్కారు అహో..ఓహో అని చెప్పినవన్నీ విని సదుద్ధేశంతో మద్దతు ఇచ్చామనీ, ఆ తర్వాత ఎంతో బాధపడ్డామని తెలిపారు. యూపీ ఎన్నికల్లో భాగంగా ఇద్దరు రాజకీయ నాయకుల దగ్గర ఉన్న డబ్బు కోసం నోట్ల రద్దు తీసుకొచ్చారనీ, దాని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉండాలి..వ్యాపారాలు కొందరే చేయాలి..ప్రజలు తాము చెప్పేది వినాలనే దుర్మార్గపు ఐడియాలజీ బీజేపీదని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయకరణను ఆనాటి జనసంఫ్‌ు తీవ్రంగా వ్యతిరేకించి సుప్రీం కోర్టుకెళ్లి అడ్డుకున్నదనీ, చివరకి ఇందిరాగాంధీ చొరవ తీసుకుని రాజ్యాంగానికి ప్రత్యేక సవరణ చేసి బ్యాంకులను జాతీయకరణ చేసిందని వివరించారు. నాటి జనసంఘే నేడు బీజేపీగా రూపాంతం చెంది కేంద్రంలో అధికారంలో ఉందనీ, అందుకే మళ్లీ బ్యాంకులను ప్రయివేటీకరించేందుకు పూనుకున్నదని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌తో తెలంగాణకు నిధులు దక్కకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చుపెట్టిందే 85 వేల కోట్ల రూపాయలనీ, లక్షకోట్ల అవినీతి జరిగిందని అసత్యప్రచారం చేయడం దుర్మార్గులకే సాధ్యమని విమర్శించారు. 44 వేల చెరువుల పూడికతో తెలంగాణలో భూగర్భజలాలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌బోస్, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి రాంబాబు, కేంద్ర కమిటీ సభ్యులు పద్మ, సమద్‌ఖాన్, ఏఐబీఓసీ నేత ఫణికుమార్, తదితరులు పాల్గొన్నారు.