Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 శాతం మందికే రోగనిర్ధారణ
- నిర్దారించిన వారిలోనూ మూడో వంతు మందికే చికిత్స
- పెరుగుతున్న కాలేయ మార్పిడిలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొన్ని వ్యాధుల పట్ల ప్రపంచం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. మరికొన్ని రోగాల గురించిన సమాచారం మాత్రం అంతగా ఉండదు. అలా అని ప్రచారంలో ఉన్న రోగాలతోనే మానవాళికి ఎక్కువగా ప్రమాదముందని భావించలేం. కొన్ని రోగాలు చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రతి ఏడాది లక్షలాది మంది చావులకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిలో హెపటైటీస్ ఒకటి. కాలేయమార్పిడి శస్త్రచికిత్సలు పెరిగిపోవడానికి కూడా ప్రధాన కారణాల్లో ఇదొకటి. శరీర ద్రవ్యాల ద్వారా అంటువ్యాధిలా ప్రబలుతున్న దీన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయా దేశాలను హెచ్చరించింది. మన దేశంలోనూ హెపటైటీస్ నిర్మూలనకు జాతీయ స్థాయిలో కార్యక్రమాలున్నప్పటికీ అవి నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. ఈ వ్యాధి వ్యాప్తి తీవ్రత ద ృష్ట్యా నిర్మూలనా కార్యక్రమాలను కూడా అంతే ప్రభావవంతంగా నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. హెపటైటీస్ బి, హెపటైటీస్ సి వచ్చిన వారిలో కేవలం 30 శాతం మంది మాత్రమే రోగ నిర్ధారణతో తమకు ఆ వ్యాధి సోకినట్టుగా నిర్దారించుకుంటున్నారు. మిగిలిన వారిలో ఆ వ్యాధి ముదిరి కాలేయం పూర్తిగా చెడిపోయే వరకు జాగ్రత్తలు తీసుకోవడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇది దీర్ఘకాలిక కాలేయ జబ్బుగా (సిర్రోసిస్) మారి క్యాన్సర్కు దారి తీస్తున్నదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. హెపటైటీస్ బితో ప్రతి ఏడాది నాలుగు కోట్ల మంది బాధితులుగా మారుతుండగా, వారిలో ఒక లక్షా 15 వేల మంది చనిపోతున్నట్టు సమాచారం. వ్యాధి తీవ్రత నేపథ్యంలో జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో హెపటైటీస్ బి వ్యాక్సిన్ తప్పనిసరి చేశారు. హెపటైటీస్ ఎ ఆప్షనల్ గా నిర్ణయించారు. అయితే ఇప్పటికీ హెపటైటీస్ సి వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ లేకపోవడంతో మందులతోనే చికిత్స చేయించుకోవాల్సి వస్తున్నది. జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో చేర్చడంతో పిల్లల వరకు వ్యాక్సిన్ ఉన్నప్పటికీ పెద్ద వయస్సు వారు హెపటైటీస్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
శరీర ద్రవ్యాల ద్వారా....
హెపటైటీస్ బి,సీ వ్యాధులు ప్రధాన శరీర ద్రవ్యాలు చెమట, రక్తం, లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంటాయి. హెపటైటీస్ ఎ నీటి కాలుష్యం ద్వారా వస్తుంటుంది. ఇప్పటికీ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లో 80 శాతం మందికి చికిత్స అందుతున్నది. హెపటైటీస్ విషయంలో అది కేవలం 30 శాతం మందికే పరిమితం కావడం ఈ వ్యాధి చికిత్స పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నది.
మందుల ధరలు తగ్గిస్తే మేలు...
హెపటైటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్యనూ, మరణాలను తగ్గించేందుకు 2030 లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాచరణ ప్రకటించింది. ఆ మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. హెపటైటీస్పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాక్సిన్ లేని హెపటైటీస్ సికు ప్రస్తుతం మందుల ధరలను మన దేశంలో 20 శాతం మాత్రమే తగ్గించారు. ఈ ధరలను కనీసం 50 శాతం తగ్గించాలని సూచించింది. తద్వారా వ్యాధిగ్రస్తుల్లో మందుల వాడే అలవాటు పెరుగుతుందని తెలిపింది.
న్యాకో తరహాలో నిర్మూలన చర్యలు తీసుకోవాలి
పోలియో, టీబీ, ఎయిడ్స్ నిర్మూలనకు జాతీయ స్థాయిలో చేపట్టినట్టుగా హెపటైటీస్కు ప్రభావవంతంగా కార్యక్రమాలను రూపొందించాలని డాక్టర్ కిరణ్ మాదాల సూచించారు. నామమాత్రంగా కాకుండా నిధులను సరిపోయే విధంగా కేటాయించడం ద్వారా ఈ వ్యాధిపై పోరాడుగలుగుతామని చెప్పారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి తరహాలో హెపటైటీస్ నియంత్రణకు ప్రత్యేక మానవవనరులు, నిధిని కేటాయిస్తే సత్ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
- డాక్టర్ కిరణ్ మాదాల