Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాలతో మొలకెత్తిన ధాన్యం
- మిల్లింగ్‌కు అనుమతివ్వని రాష్టం
- కేంద్రం లెవీ సేకరణ బంద్
- మూతపడిన 1500 మిల్లులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం బియ్యం లేవీ సేకరణ నిలిపివేయడంతో మిల్లుల్లో నిల్వ ఉన్న 1010 రకం ధాన్యం ముక్కిపోతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తింది. మూడు సీజన్ల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో మిల్లులోనే ధాన్యం బస్తాలు మూలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం లేవీ సేకరణ నిలిపివేయడంతో సీఎంఆర్ బియ్యం సేకరణ నిలిచిపోయింది. 43 రోజులుగా మిల్లుల్లో మిల్లింగ్ లేకపోవడంతో అనేక మిల్లులు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
రాష్ట్ర వ్యాప్తంగా 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో నిల్వ ఉంది. కేవలం మిల్లింగ్ చేసే మిల్లులు సుమారు 1500 ఇప్పుడు పని లేక మూతపడ్డాయి. ఇందులో పని చేస్తున్న సుమారు 1.50 లక్షల మంది హమాలీ
కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఆయా మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యంలో వర్షం కారణంగా సుమారు 10శాతం ధాన్యం పాడైంది. ధాన్యం తడిసి మొలకెత్తడం, ముక్కి పోవడం జరిగింది. ఈ నష్టం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. కానీ మిల్లుల్లో ధాన్యం ఉండటం వల్ల వాటి రక్షణకు ఆర్థిక భారం పడటంతోపాటు నష్టం కూడా తమపై వేస్తారని మిల్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ
నల్లగొండ జిల్లాలో సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయా మిల్లుల్లో నిల్వ ఉంది. మూడు సీజన్లుగా లేవీకు పెట్టిన ధాన్యం మిల్లింగ్ చేయకపోవడంతో పెద్దఎత్తున నిలిచిపోయింది. జిల్లాలో 106 మిల్లులకు ధాన్యం కేటాయించారు. 2020-2021 యాసంగిలో 17,626 మెట్రిక్ టన్నులు, 2021- 2022 వానాకాలంలో 1,54,263 మెట్రిక్ టన్నులు, 2021-2022 యాసంగిలో 3.27 లక్షల మెటిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది మొత్తంగా 4,98,889 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. ఇందులో 10 శాతం అంటే సుమారు 50 వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం పాడైంది. గతంలో చేసిన మిల్లింగ్‌కు సంబంధించి మిల్లర్స్‌కు కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది. జిల్లాలో 250పైగా రైస్ మిల్లులు ఉండగా.. మిర్యాలగూడ పట్టణంలోనే 83 మిల్లులు ఉన్నాయి. ఇందులో 63 మిల్లులు లేవీ బియ్యంపైనే ఆధారపడి ఉన్నవి. ఇప్పుడు ఆ మిల్లులు లెవీ లేని కారణంగా మూతపడ్డాయి.
ప్రభుత్వం లెవీ సేకరణ చేపట్టాలి
లెవీపై ఆధారపడి.. ఇప్పుడు పనిలేక మూతపడిన రైస్ మిల్లులను ప్రభుత్వం వెంటనే తెరిపించాలి. ఆయా మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. దీని ద్వారా రైస్ ఇండిస్టీ నడుస్తుంది. దీనిపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి లభిస్తుంది. రైతులు పండించిన 1010 రకం ధాన్యానికి మద్దతు ధర అందుతుంది. మిల్లింగ్ చేసిన బకాయి చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలి. మిల్లుల్లో ముక్కిపోయిన ధాన్యం నష్టం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
- గౌరు శ్రీనివాస్,
మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు.
బలవంతం చేసి ధాన్యం దిగుమతి చేశారు
అధికారులు బలవంతం చేసి 1010 రకం ధాన్యాన్ని కిష్టాపురంలో ఉన్న శివరామకృష్ణ రైస్ మిల్లులో సివిల్ సప్లరు దిగుమతి చేశారు. తన మిల్లులో ఇప్పుడు 1.35 లక్షల బస్తాల ధాన్యం నిల్వ ఉంది. మూడు సీజన్లలో ధాన్యం తెచ్చి వేశారు. గోదాముల ఖాళీగా లేకున్నా బలవంతం చేసి ధాన్యం దించారు. మంత్రి రెండుసార్లు పోన్ చేసి ధాన్యం దిగుమతి చెసుకోకపోతే మిల్లు సీజ్ చేస్తామని బెదిరించారు. ఆరుబయట నిల్వ ఉండటం వల్ల ధాన్యం వర్షానికి తడిసి నాశనం అయ్యిది. ఆ నష్టం మాపైనే వేస్తారు. గతంలో చేసిన మిల్లింగ్‌కు చార్జీలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. చాలా వరకు చార్జీలు రావాలి. మిల్లింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లింగ్ నిలిచిపోయి మిల్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. కరెంట్ బిల్లులు కట్టుకోలేని పరిస్థితి ఉంది. మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలి.
- మిల్లు యజమాని వెంకట రత్నం