Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం
- యాజమాన్యం, ప్రభుత్వాలదే వైఫల్యం
- కార్మికుల శ్రమ ఫలం బ్యాంకు వడ్డీలకే..
- ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయి తక్షణమే ఇవ్వాలి : సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్ది
- కార్మికుల సొంతింటి కల సాకారం.. వేతనాల పెంపు.. బదిలీ వర్కర్లను పర్మినెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష
కార్మిక సమస్యల పరిష్కారంలో అసాధారణ జాప్యం చేస్తున్న సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సీఐటీయూ కార్మిక నేత సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారు. వినతిపత్రాలు, నిరసనలు, ధర్నాలకు స్పందించని యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఈ నెల 11నుంచి గోదావరిఖనిలో ధర్మాగ్రహ దీక్షను ప్రారంభించనున్నారు. బండ కింద కార్మికుల బతుకులు రాలిపోతున్నా, కనికరంలేని అధికారుల కండ్లు తెరిపించేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధపడిన ఎర్రజెండా బిడ్డ, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డితో 'నవతెలంగాణ' ముఖాముఖి.
నిరవధిక నిరాహార దీక్ష ఎందుకు?
తెలంగాణ రాష్ట్ర సాధకులు, కార్మిక హక్కుల సాధనలో ముందుండి పోరాడే సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసమే!
యాజమాన్యం ముందుంచిన ప్రధాన డిమాండ్లు ఏమిటీ.?
భూతల్లి ఒడిలోకి వెళ్లి, ప్రతిరోజూ మృత్యువును జయించే బొగ్గు గని కార్మిక అన్నలకు విప్లవ జేజేలు. 40ఏండ్లు కష్టం చేసి ఉద్యోగ విరమణ చేసిన కార్మికుడికి సొంత ఇల్లును యాజమాన్యం సమకూర్చాలి. కోలిండియా మాదిరిగా కార్మిక సౌకర్యాలపై ఆదాయ పన్నును యాజమాన్యమే చెల్లించాలి. బదిలీ వర్కర్లను పర్మినెంట్ చేయాలి. బినామీ పేర్లను మార్చాలి. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి.
నిరాహార దీక్షతో యాజమాన్యం,
ప్రభుత్వం స్పందిస్తుందని భావిస్తున్నారా?
ప్రజా పోరాటాలకు ఎవరైనా దిగి రావాల్సిందే. మహా నియంతలే మట్టిలో కలిసిపోయారు. కార్మిక శక్తి అజేయమైనది. తప్పకుండా విజయం సాధిస్తామని భావిస్తున్నాను.
సొంత ఇంటి పథకం అవసరమేమిటీ?
అది ఎలా ఉండాలంటున్నారు?
పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్నది. సంపద సృష్టించే గని కార్మికులకు సొంత ఇల్లు లేకపోవడం విచారకరం. 250గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రుణం యాజమాన్యమే సమకూర్చాలి. కార్మికులకు ఇచ్చే ఇంటి అద్దెను బ్యాంకు ఈఎంఐకి జమ చేస్తే కార్మికుడు దిగిపోయే నాటికి అప్పు తీరుతుంది. ఇల్లు మిగులుతుంది. యాజమాన్యంపై భారం పడదు. ఇప్పుడు ఉన్న సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లు 50ఏండ్ల కిందట నిర్మించినవి. వాటిని కూల్చేసి కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
సింగరేణి స్థలాలు, క్వార్టర్ల పరిస్థితి ఎలా ఉంది?
సింగరేణి యాజమాన్యం 49,500క్వార్టర్లను నిర్మించింది. అందులో 30వేల క్వార్టర్లను కార్మికులకు కేటాయించారు. మిగతావి పలుకుబడిగల వారి దురాక్రమణలో, పోలీసులు, రాజకీయ నాయకుల అనుచరులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. కొంతమంది ఇంటి కిరాయిని చెల్లించడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో దురాక్రమణదారులకు సింగరేణి ఉన్నతాధికారులు నూరు శాతం సహకరిస్తున్నారు.
భవిష్యత్ తరాల మాటేమిటీ ?
ప్రయివేటీకరణ పెరిగింది. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇకపై ఉన్నవారినే తొలగిస్తారు. ఇప్పటికే వ్యాపారులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు సింగరేణి భూమిని ఆక్రమించారు. వీరికి అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. కార్మికులకు నివాస స్థలాలు ఇవ్వడం వల్ల సంస్థకు ఎలాంటి నష్టమూ జరగదు.
మీరు సింగరేణి కార్మిక సంఘం నేత.. మరి కాంట్రాక్టు కార్మికుల కోసం కూడా పోరాటం ఎందుకోసం?
కాంట్రాక్టు కార్మికులు ఈ ప్రాంతం బిడ్డలే. గని కార్మికుల బంధువులు, కుటుంబీకులే. సింగరేణి సాధించే లాభాలు ఆ కార్మికుల శ్రమను దోచుకోవడం ద్వారా సాధించినవే! పర్మినెంట్ పని స్థలాల్లో పనిచేస్తున్నందున కాంట్రాక్టు కార్మికులను కూడా పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి. కోల్బెల్ట్ ఎమ్మెల్యే, ఎంపీలు వారి పక్షాన పని చేయాలి. కార్మికులు బతకడం కోసం కనీస వేతనాలు ఇవ్వాలి.
బినామీ పేర్ల మార్పు ఎలా సాధ్యం?
ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పుడే ఆలోచించాలి. అసెంబ్లీలో చట్టం చేయాలి. న్యాయ కోవిదులను సంప్రదించి గెజిట్ ద్వారా న్యాయం చేయాలి.
సీటూ(సీఐటీయూ) పోరాటం ఎన్నికల స్టంట్గా విమర్శిస్తున్నారు కదా!
ఇది పచ్చి అబద్ధం. యాజమాన్యం, ప్రభుత్వ ఏజెన్సీల దుష్ప్రచారం. కార్మికుల జీతభత్యాలు, హక్కులపై సంప్రదింపులు జరిపి, ఒప్పందాలు చేసుకునే కోల్ ఇండియాలో గుర్తింపు సంఘం ఎన్నికలు లేవు. ఎన్నికలు కార్మికులకు నష్టదాయకం. గెలిచిన సంఘానికి లాభదాయకం. కార్మికుల పక్షాన పోరాడేవాళ్లం. ఎన్నికలతో ఒరిగేదేమీ లేదు. అయినా ఈ దఫా ఎన్నికలు వస్తే కార్మికుల ఆదరణతో గెలిచి తీరుతాం.
బదిలీ వర్కర్ల మాటేమిటీ?
నిబంధనల ప్రకారం 190/240మస్టర్లు ఏడాదిలో పూర్తి చేసిన వారందరినీ పర్మినెంట్ చేయాలి. ఎన్నికల సమయంలో అధికార పార్టీ గెలుపు కోసం కార్మికుల సంక్షేమం పట్టినట్టు యాజమాన్యం నటిస్తుంది. తర్వాత మర్చిపోతోంది. దీని వల్ల ఆర్థికంగా, ప్రమోషన్లలో బదిలీ వర్కర్లు నష్టపోతున్నారు.
సింగరేణి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది?
కాగితాలపై వేల కోట్ల లాభాలు చూపిస్తున్నారు. ఆచరణలో అప్పుల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కార్మికులు సంపాదించిన డబ్బులను బ్యాంకు వడ్డీలకు జమ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రూ.26వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. తక్షణమే చెల్లించాలి. సింగరేణి మరో ఖాయిలా పరిశ్రమ కాకుండా కాపాడుకుందాం. ప్రయివేటీకరణ నుంచి తప్పించుకుందాం.
సింగరేణి గుర్తింపు సంఘం పనితీరు ఎలా ఉంది?
గుర్తింపు సంఘం కాలపరిమితి రెండేండ్ల కిందట ముగిసింది. ప్రభుత్వం అండతో దొడ్డిదారిన అధికారంలో కొనసాగుతున్నారు. పైరవీలకు, డబ్బు సంపాదనకు కార్మిక హక్కులను తాకట్టు పెట్టారు. వారి వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతున్నది. ముఖ్యమంత్రిని కలిసి కార్మిక సమస్యలు విన్నవించే స్థితి కూడా వారికి లేదు.
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి పరిస్థితి ఎలా ఉంది?
ఉమ్మడి రాష్ట్ర పాలకుల కంటే అధ్వానంగా తయారైంది ఇప్పుడు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయింది. లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదు. సింగరేణి బొగ్గును, విద్యుత్తును వాడుకుంటూ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. కార్మికులను మభ్య పెట్టేందుకు లాభాల వాటా పేరిట డబ్బులు పంచుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సింగరేణి ప్రయివేటు జాబితాలోకి చేరే ప్రమాదముంది.