Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం
- ఈనెల 21,22 తేదీల్లో నిరసనలు : ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ, మహాత్మగాంధీ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకు నిరసనగా గురు, శుక్రవారాల్లో జరగనున్న దేశవ్యాప్త నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా ఆయన విలేకర్లతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పంపిన సమన్లకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారని పేర్కొకన్నారు.. ప్రతి పక్ష నాయకులే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ప్రయోగిస్తున్నదని విమర్శించారు. గాంధీ కుటుంబంపై ఈడీ చేసిన మనీలాండరింగ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. నేషనల్ హెరాల్డ్ సమస్య అనేది డబ్బు లావాదేవీలు లేకుండా ఒక సాధారణ రుణం-ఈక్విటీ మార్పిడి అని ఆయన వివరించారు. లావాదేవీల్లో డబ్బు ప్రమేయం లేనందు వల్ల మనీలాండరింగ్ అనే ప్రశ్న తలెత్తదని వివరించారు. నెహ్రూ,గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ద్రవ్యోల్బణం, భారత్‌లోకి చైనా చొరబాటు తదితర వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోడీ సర్కారు ఈడీని ఉపయోగిస్తున్నదని ఆరోపించారు. ఈక్విటీకి మార్పిడి అనేది రుణాలిచ్చే బ్యాంకులు తరచుగా చేసే ఒక సాధారణ ప్రక్రియ అని అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్‌గాంధీ అమరులయ్యారని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో రెండు సార్లు ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చినా సోనియాగాంధీ పదవి కోసం ఆరాటపడలేదని చెప్పారు. ఆమె నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఆహారభద్రత, సమాచార హక్కు, (ఆర్టీఐ), విద్యాహక్కు (ఆర్టీఈ) వంటి విప్లవాత్మక చట్టాలు తీసుకొచ్చిందన్నారు.
రుణమాఫీ ఏమైంది? : సీఎంకు కోదండరెడ్డి ప్రశ్న
గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. రైతులకు ఇప్పటివరకు రుణమాఫీ కాలేదన్నారు. రైతు బంధుతో పాటు రైతులు పండించిన పంటలకు డబ్బులు అన్నదాతల ఖాతాలో పడతాయనీ, రైతులకు చెప్పకుండా అప్పుకింద బ్యాంకులు డబ్బులు జమ చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ కారణంగా ఇటీవల ఒక రైతు బ్యాంకు ముందుకు పోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఇదే విషయంపై మంగళవారం హైదరాబాద్‌లోని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్‌కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. ఇలాంటి చర్యలను నియంత్రించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు వ్యవసాయ మీదే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. బ్యాంకుల సొంత డబ్బులు కాదనీ, అది ప్రజల సొమ్ము అని తెలిపారు.