Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా అండతోనే పేదలకు ఇండ్ల స్థలాలు
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు
- జి.నాగయ్య, ఆర్. వెంకట్రాములు
- వికారాబాద్ జిల్లాలోని 3 గ్రామాల్లో దాదాపు 80 ఎకరాల భూమి అన్యాక్రాంతం
నవతెలంగాణ-పరిగి
'ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు వాటిని పంపిణీ చేసి పట్టాలివ్వాలని, లేకపోతే తామే వాటిని పంచుతామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు జి నాగయ్య, ఆర్. వెంకట్రాములు డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్లో సీపీఐ(ఎం), తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య అధ్యక్షతన భూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా పేద ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పేదలకు ఇండ్ల స్థలాలు, విద్య, వైద్యం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు గడుస్తున్నా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మభ్య పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు లక్షల ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పి, అందులో లక్షా 80 వేల ఇండ్లు మాత్రమే పూర్తిచేసి 36వేల ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారని ఆరోపించారు. కోనేరు రంగారావు కమిషన్ ప్రకారం కోటీ 30 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం ఏడాదికి రెండు పంటలు పండితే 18 ఎకరాలు, ఒక పంట పండితే 27 ఎకరాల భూమి ఒక వ్యక్తికి ఉండాలని తెలిపారు. కానీ ఎంతోమంది భూస్వాముల దగ్గర వందల ఎకరాల భూమి మగ్గుతోందన్నారు. ఇప్పటికే మూడు లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని, ఇంకా 10 లక్షల ఎకరాల భూమి పంచడానికి ఉన్నా ప్రభుత్వం పంచడం లేదని తెలిపారు. పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో 9 ఎకరాల 39 గుంటల భూమి ఉందని, భవాని హౌటల్ వెనకాల శిఖం భూమి అన్యాక్రాంతం అయిందని, పరిగి పట్టణ కేంద్రంలో తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, నారాయణపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 143,144, 145లో దాదాపు 32 ఎకరాల భూదాన్ భూమిని ఐరన్ ఫ్యాక్టరీ, భూ కబ్జాదారులు ఆక్రమించారని తెలిపారు. పరిగి పట్టణ కేంద్రంలోని 9 ఎకరాల భూమిని రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి అంటే అందరికీ హక్కు ఉంటుందని, అందుకే ఈ భూ ఆక్రమణలపై పరిగి నుంచే భూ పోరాటం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సదస్సులో భూ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా ఎం.వెంకటయ్య, పది మంది కో-కన్వీనర్లు, 30 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్.మైపాల్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య, సీపీఐ(ఎం) మండల నాయకులు బసిరెడ్డి, మండల కన్వీనర్ హబీబ్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.